మన్మథుడు-2లో సమంత కీలక పాత్ర?


అక్కినేని నాగార్జున తన కోడలు సమంతతో కలిసి ఇప్పటికే మనం, రాజుగారి గది చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి ఇప్పుడు మ‌రోసారి న‌టించ‌బోతున్నార‌ట. ప్ర‌స్తుతం నాగార్జున మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్ గా మన్మథుడు 2 తెరకెక్కిస్తున్నారు. త‌న సొంత సంస్థ అన్నపూర్ణ బ్యానర్‌లో ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నారు. చిల‌సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. మార్చి 12న ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందట. ఈ సినిమాలో ఎక్కువ భాగం యూర‌ప్ లోనే షూటింగ్ జరుపుకోనుందట. దీనికోసం ఇప్ప‌టికే అంతా ప్లాన్ చేసుకున్నాడు నాగార్జున‌.

పెళ్లి తర్వాత సమంత ఇమేజ్‌ మరింత పెరిగింది. ఓవైపు అక్కినేని కోడలుగా అంతే కాకుండా ఈమధ్య హాట్‌ ఫొటో షూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ అప్‌డేటెడ్‌గా కనిపిస్తోంది సమంత. తాను ఇంకా పాత సమంతనే అని చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ ఈమెతో నటించేందుకు హీరోలు సిద్ధంగా ఉన్నారు. దర్శకులు సైతం సమంత కోసం ప్రత్యేక కథలు సిద్ధం చేస్తున్నారట. రోజు రోజుకీ సమంత తన క్రేజ్‌ను పెంచుకుంటుందనడంలో సందేహం లేదు. కోడలు క్రేజ్‌ను తన సినిమాలో కాస్తంతైనా వాడుకుందామని నాగార్జున భావిస్తున్నాడట. అందుకే మన్మథుడు-2లో రకుల్ హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో సమంత నటించబోతుందట. మామా కోడలు కలిసి నటిస్తే సినిమాకు క్రేజ్ కూడా మరింత పెరుగుతుంది కదా!