
Ambani new bulletproof car:
భారతదేశపు అత్యంత ధనిక కుటుంబం అయిన అంబానీలు లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి పెట్టింది పేరే. వారికి ఉన్న కార్ల కలెక్షన్ వేరే స్థాయిలో ఉంటుంది. తాజాగా అంబానీ ఫ్యామిలీ తమ గ్యారేజీకి ఒక ప్రత్యేకమైన కారు జోడించింది – బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ కులినన్. ఇది వారి లగ్జరీ, సెక్యూరిటీ రెండింటినీ కలిపిన ఓ మాస్టర్‌పీస్ అనే చెప్పాలి.
ఈ ప్రత్యేకమైన సిల్వర్ కులినన్ ఫోటోలు ఇటీవల చండీగఢ్‌లోని బుల్లెట్‌ప్రూఫ్ వర్క్‌షాప్ వద్ద కనిపించాయి. దీనిని 20 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రత్యేకంగా మోడిఫై చేశారు. రోల్స్ రాయిస్ కులినన్ ఇప్పటికే సూపర్ లగ్జరీ కారుగా పేరు పొందింది. అయితే, అంబానీ కుటుంబం దీనిని మరింత భద్రతతో మార్చుకుంది.
అంబానీల దగ్గర ఇప్పటికే 10కి పైగా రోల్స్ రాయిస్ కులినన్ కార్లు ఉన్నాయని వార్తలు చెబుతున్నాయి. ఫాంటమ్ VIII ఎక్స్‌టెండెడ్ వర్షన్, బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్స్, 2019లో ఇండియాలో మొదటిగా కొన్న కులినన్ ఇవన్నీ వారి కలెక్షన్‌లో ఉన్నాయి.
రోల్స్ రాయిస్ మాత్రమే కాదు, బెంట్లీ, మెర్సిడెస్-మేబాచ్, లంబోర్ఘిని, ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ బ్రాండ్ల కార్లు కూడా అంబానీ గ్యారేజీలో చోటు చేసుకున్నాయి. ప్రత్యేకమైన కార్లు, కస్టమ్ డిజైన్లు అంటే అంబానీలకు ప్రత్యేకమైన అభిరుచి ఉంది.
ముకేష్ అంబానీ సాధారణంగా మెర్సిడెస్-బెంజ్ S 680 గార్డ్ లాంటి బుల్లెట్‌ప్రూఫ్ సెడాన్‌లలో కనిపిస్తారు. అయితే భారత రోడ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కులినన్ ఎస్‌యూవీ ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ఇది లగ్జరీని, భద్రతను కలిపిన అత్యుత్తమ కారు అని చెప్పొచ్చు.













