కంగనా ‘లైంగిక వేధింపులు’ సీరియస్‌గా తీసుకోవడం కష్టమే: సోనమ్

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్.. నటి సోనమ్‌కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ‌. తాను నటించిన ‘క్వీన్‌’ సినిమా దర్శకుడు వికాస్‌ బెహెల్‌ తనను లైంగికంగా వేధించాడంటూ కంగన షాకింగ్‌ విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సోనమ్‌ కపూర్‌ స్పందిస్తూ.. ‘కంగన చాలా చెప్తుంటారు. కొన్నిసార్లు ఆమె చెప్పేవి సీరియస్‌గా తీసుకోవడం కష్టమే. అయినప్పటికీ ఆమె తన పట్ల జరిగిన ఘటనల గురించి ధైర్యంగా బయటపెట్టడం అభినందనీయం. ఈ విషయంలో ఆమెను నేనెంతో గౌరవిస్తాను’ అన్నారు.

సోనమ్‌ తన గురించి అలా అనడంతో కంగనకు ఒళ్లుమండింది. ‘కంగన చెప్పేవి సీరియస్‌గా తీసుకోవడం కష్టం’ అని సోనమ్‌ అన్న మాటలకు అర్థం ఏంటి? అంటే కొందరు మహిళలను మాత్రమే నమ్మాలన్న లైసెన్స్‌ ఆమెకు ఉందా? నాకు జరిగిన వేధింపుల గురించి నేను చెప్పుకొన్నాను. నేను చెప్పేవి తప్పు అని ఆమె ఎలా చెప్పగలుగుతోంది? ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాల్లో భారత్‌ తరఫున పాల్గొన్నాను. ఆ కార్యక్రమాల్లో నన్ను యువతకు రోల్‌మోడల్‌ అని ప్రశంసించేవారు. నా తండ్రి వల్ల నాకు గుర్తింపు దక్కలేదు. పదేళ్లుగా కష్టపడుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నా. సోనమ్‌ అంత గొప్ప నటి ఏమీ కాదు. గొప్పగా మాట్లాడుతుంది అన్న పేరు కూడా లేదు. ఇలాంటి సినీ సెలబ్రిటీలకు నా గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? వారందరినీ అణచివేస్తాను.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కంగన.

వికాస్‌ బెహెల్‌ గురించి కంగన షాకింగ్‌ విషయాలు బయటపెట్టడంతో అతనికి సినిమా అవకాశాలు పోయాయి. హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘సూపర్‌ 30’ సినిమాకు వికాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అతని నిజస్వరూపం కంగన బయటపెట్టడంతో ఓ భారీ ప్రాజెక్ట్‌ నుంచి ఆయన్ని తొలగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బహుశా ఆయన్ను తొలగించింది హృతిక్‌ సినిమా నుంచే కావచ్చు. బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా..నానా పటేకర్‌పై ఆరోపణలు చేయడంతో చాలా మంది నటీమణులు తమను వేధించిన వారి పేర్లు బయటపెడుతున్నారు. వారిలో బాలీవుడ్‌ నటుడు రజత్‌ కపూర్‌, ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ ఉన్నారు. ఒక్కొక్కరి పేర్లు బయటికి వస్తుండడంతో వారంతా ముందు జాగ్రత్తగా సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు చెప్తున్నారు.