‘సవ్యసాచి’ నుంచి ‘లగాయత్తు’

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అలనాటి పాట ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు’ను రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ట్రైలర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. రీమిక్స్‌ బీట్‌కు చైతన్య, నిధి చేసిన డ్యాన్స్‌ ఆకట్టుకుంటోంది. 1993లో అక్కినేని నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ఈ పాట కుర్రకారును ఉర్రూతలూగించింది.

ఇప్పుడు ఇదే పాటను నాగచైతన్య రీమేక్‌ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తొలుత ఈ పాటలో చైతూకి జోడీగా తమన్నాను ఎంపికచేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దాంతో నిధి అగర్వాల్‌నే పెట్టి చిత్రీకరించారు. ఒరిజినల్‌ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు. రీమేక్‌ పాటను పృథ్వీ చంద్ర, మౌనిమ ఆలపించారు. ‘సవ్యసాచి’ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, రవి, మోహన్‌ చెరుకూరి నిర్మించారు. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది.