HomeTelugu Newsపదుగురు మెచ్చిన పది లక్షణాల సంపన్నుడు!

పదుగురు మెచ్చిన పది లక్షణాల సంపన్నుడు!

”కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు” ఎంతో అర్ధవంతమైన, ఆదర్శవంతమైన ఈ చిన్న వ్యాసాన్ని రేయింబవళ్లు ఆచరిస్తూ.. మనసావాచా గౌరవిస్తూ.. 1978 సంవత్సరంలో సినిమా రంగంలో అడుగుపెట్టిన అందగాడు కొణిదల శివశంకర వరప్రసాద్ వెంటనే చిరంజీవిగా ఎదగటానికి, సినీ పూదోటలో వికసించడానికి పెద్దగా ఆలస్యం కాలేదు. త్వరత్వరగా తొలి చిత్రాలైన పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు, చిత్రాల ఆవిష్కరణతో పరిశ్రమ్లో అందరినీ ఆకర్షించారు. ఆ తరువాత విడుదలయిన బాపుగారి ‘మావూరి పాండవులు’ చిత్రంతో మంచి మైలేజీ రావడంతో తెలుగు సినీరంగానికి ఆత్మీయుడు ఆపధ్బాంధవుడు లాంటి మంచి హీరో దొరికాడు. దాదాపు నాలుగు దశాబ్ధాల చరిత్ర వేగవంతంగా సాగింది. 149 నుండి 150 వ చిత్రానికి ఆయన చేరుకున్నారు. ఇదో అద్బుత ఘట్టం. చరిత్రకారుడు ఈ 150 వ చిత్రం గురించి ఎంత రాసినా.. ఇంకా చాలా మిగిలే ఉంటుంది. మధ్యలో రాజకీయరంగ ప్రవేశంతో ఆయన వెండితెరకు కాస్తంత దూరం అయ్యారేగానీ.. ఆయన ఇప్పటికీ, ఎప్పటికీ ‘సినీ కళామతల్లి ముద్దుబిడ్డే’.

దానికోసం ఆ పరమాత్ముడు ఇచ్చిన ప్రియమైన కానుక ఈనాటి ‘ఖైదీ నెంబర్ 150’. ఆయన ఎన్నో ఆణిముత్యాలు ‘న్యాయం కావాలి, మోసగాడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య , పట్నం వచ్చిన పతివ్రతలు, మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, అడవి దొంగ, కొండవీటి రాజా, గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు, స్వయం కృషి, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఠాగూర్, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ ఇలా రాసుకుంటూ వెళితే అదో హిమాలయం. ఇలా 149 చిత్రాల్లో నటించిన ఎట్టకేలకు 150వ చిత్రాన్ని తన అభిమానులకు కానుకగా ఇవ్వాలని ఆయన చేసిన అధ్బుత సాహసమే ఈ ‘ఖైదీ నెంబర్ 150’. ఈ మధ్య కాలంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అవన్నీ ఆయన ఇంటికి పరుగులు తీశాయి.. అతిథులై ఉండిపోయాయి. సుమారు నాలుగు దశాబ్ధాల నిర్వివాదమైన, నిశబ్ధమైన, నిర్మలమైన చరిత్ర ఈ సినిమా రంగంలో గడపాలంటే ఆ వ్యక్తికి ఎవరికైనా కొన్ని అధ్బుతమైన అపురూపమైన లక్షణాలు ఉండాలి. అవన్నీ.. ఈ మెగాస్టార్ సొంతం చేసుకున్నారు కనుకనే, ఆయనకు లభించిన స్థానం, గౌరవం పదిలం అయ్యాయి. ఆ విలువలు చెదరవు, ఆ వైభవం ఇప్పట్లో తరగదు. అయితే ఈ సంధర్భంలో పరిశీలించవలసిన చిరంజీవి వ్యక్తిత్వ సలక్షణాలు చాలా ఉన్నాయి. ఆ

యన్ను ఈ పరిశ్రమలోనే నిలుపుకున్న అంశాలలో మొదటిది ఆయన తన నిర్మాతలకు నిజమైన హితుడు, స్నేహితుడు. ఆయన ఇంత కాలం నటించిన చిత్రాల నిర్మాతలు అందరూ కోట్లకు పడగలు ఎత్తినవారితో పాటు తక్కువ, ఎక్కువ ఉన్నవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన నిర్మాతలందరినీ. సమానమైన గౌరవంతో చూశారు, ఆదరించారు. నిర్మాత బావుంటేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందన్న బలమైన సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా నమ్మి, అవసరమైన సమయాల్లో నిర్మాతలకు సంతోశంతో సహకరించారు. ఆయా చిత్రాలను అనుకున్న షెడ్యూల్స్ లో పూర్తి చేసేవారు చిరంజీవి. అలాగే ఆయన నటించిన చిత్రాల నిర్మాతలు ఎప్పుడు ఎక్కడ ఆర్థికంగా నష్టపోయారన్నవ్యాఖ్యలు చిరంజీవి చరిత్రలో వినలేదు.. కళ్ళకు కానరాలేదు. కారణం చిరంజీవి ఓ మానవతా రూపానికి భగవంతుడు ప్రాణం పోసిన శిల్ప సుందరుడు. ఎప్పుడూ నవ్వుతూ.. చిన్నా, పెద్దా, అందరినీ పలకరించే చిరంజీవి తన పాత్రల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. తీరిక వేళల్లో, షూటింగ్ సెట్స్ లో తాను ధరిస్తున్న పాత్ర నైజం, స్వభావం దానిని ఎలా మలిస్తే బావుంటుందన్న ఆలోచన తరంగాలను ప్రవహింపజేసేవారు. చిన్న ఉదాహరణ తీసుకుంటే ‘ఖైదీ’ చిత్రంలో ఆయన చేసిన నటనకు, ‘రుధ్రవీణ’లో ఆయన ధరించిన పాత్రకు పోలిక లేదు. రెండూ రెండు ధృవాలే. రెండింట్లోనూ గెలిచారు.

‘ఖైదీ’ అనగానే మొదటి రీలులోనే ఆయన చేసిన పోలీస్ స్టేషన్ ఫైటింగ్ ఇప్పటికీ కళ్ళ ఎదుట మెదులుతుంది. అలా అధ్బుతమైన సినీ చరిత్ర గడుపుతూ, 1998 సంవత్సరం అక్టోబరు 2వ తేదీన చిరంజీవి ఛారిటబుల్ స్థాపించి, దానికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ లను నెలకొల్పి ఈ సమాజానికి నిజమైన ప్రాణదాతగా నిలిచిపోయారు. ఆయన నెలకొల్పిన ఈ సామాజిక సంస్థలకు ఆయన అభిమాని ఆత్మీయుడు సంస్కారవంతుడు స్వామి నాయుడు వంటి ఓ రుషితుల్యుడిని నిర్వహకుడిగా ఎంపిక చేయటంలో చిరంజీవి దూరదృష్టి, మానవతా విలువల కొలమానాలు అర్ధం అవుతాయి. ఈ లక్షణాలు ఇంకా ఎన్నో గుప్తదానాలు కలిపి చిరంజీవిని భారతీయ సినిమాకు ఓ ముద్దుబిడ్డగా ఆ సినీకళామతల్లి అక్కున చేర్చుకుంది. ఈరోజు వరకు సాగిన ఈ నవ్యప్రయాణం, దివ్య పయనం మరో 150 చిత్రాల వరకు నిర్విరామంగా సాగాలని ఆశిద్ధాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu