మెగా అతిథులు వీళ్ళే!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఫంక్షన్ ను విజయవాడకు బదులుగా గుంటూరు హాయ్ ల్యాండ్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 7న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ముఖ్య అతిథులుగా ఇండస్ట్రీ పెద్దలు దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరవుతాడా..? లేదా..? అనే అనుమానాలు కొందరు అభిమానుల్లో కలిగాయి.

వారిని దృష్టిలో పెట్టుకున్న చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఈ ఫంక్షన్ కు బాబాయ్ ను కూడా ఆహ్వానించానని తెలిపారు. అయితే ఆయన వీలును బట్టి రావడం, రాకపోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం కోసం మెగాభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.