నయన్ కు ‘ప్రత్యేక’ పారితోషికం ఎందుకంటే..?

నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ప్రస్తుతం కష్టం అవుతోంది. ఈ విషయంలో చిత్రబృందం నానాతంటాలు పడుతోంది. సీనియర్ కథానాయికలు దొరికిందే ఛాన్స్ అని సీనియర్ హీరోల సినిమాల్లో నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. చేసేదేమీ లేక నిర్మాతలు కూడా అంత మొత్తం ముట్టజెప్పుతున్నారు. దీంతో కొంతమంది హీరోయిల పంట పండుతోంది. ఇప్పటికే బాలయ్యతో రెండు సినిమాల్లో కలిసి నటించిన నయనతార ఇప్పుడు బాలయ్య 
102వ సినిమాకు జోడీ కట్టడానికి రెడీ అయిపోయింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈసారి నయన్ కు ప్రత్యేక పారితోషికం ఇచ్చి మరీ హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
ఈ ప్రత్యేక పారితోషికం ఎందుకంటే, ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అని సమాచారం. నయనతార ఏ సినిమా అంగీకరించినా.. నటన వరకే పరిమితం. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేదే లేదని ముందే చెప్పేస్తుంది. ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నా.. ఆమె మాత్రం లెక్క చేయడం లేదు. సినిమా ప్రమోషన్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెను ఎలాగైనా.. ప్రమోషన్ కార్యక్రమాలకు రప్పించాలని భావించిన చిత్రబృందం అదనపు పారితోషికం ఇస్తామని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని రిక్వెస్ట్ చేసిందట. దీనికి నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నటిస్తున్నందుకు ఒక రెమ్యూనరేషన్, ప్రమోషన్ కార్యక్రమాల కోసం మరో రెమ్యూనరేషన్.. మొత్తానికి నయన్ తన క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకుంటుంది.