రివ్యూ: స్పైడర్

నటీనటులు: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, ప్రియదర్శి తదితరులు
సంగీతం: హారీస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు
దర్శకత్వం: ఏ.ఆర్.మురుగదాస్
మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘స్పైడర్’. ఈ సినిమాతో తొలిసారి మహేష్ తమిళనాట కూడా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

:
శివ(మహేష్ బాబు) ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేస్తుంటాడు. ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడం ద్వారా ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా శివకు తెలుస్తుంది. వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో శివ ఓ ఫోన్ కాల్ వింటాడు. ఓ అమ్మాయి తన ఇంట్లో ఒంటరిగా భయపడుతుందని తెలుసుకొని ఆమె ఇంటికి ఓ లేడీ కానిస్టేబుల్ ను పంపిస్తాడు. ఆ మరునాడే ఆ ఇద్దరు కూడా సవాలుగా కనిపిస్తారు. ఎవరో వారిని అతి దారుణంగా హత్య చేస్తారు. ఆ హత్యలు ఎవరు చేశారో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు శివ. ఈ క్రమంలో శివకు భైరవుడు(ఎస్.జె.సూర్య) గురించి తెలుస్తుంది. ఆ హత్యలకు కారణం అతడే అని శివ తెలుసుకుంటాడు. ఇంతకీ ఈ భైరవుడు ఎవరు..? అతడి స్టోరీ ఏంటి..? ఇలా వరుస హత్యలు చేయడానికి గల కారణాలు ఏంటి..? శివ.. భైరవుడి ఆగడాలను అరికట్టాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
ఈ ఫాస్ట్ జెనరేషన్ లో మానవత్వాన్ని మర్చిపోతున్నారు జనాలు. మనకు పరిచయం లేని వాళ్ళకు ఏది ఆశించకుండా సహాయం చేయడమే మానవత్వం అనే పాయింట్ ను ఆధారంగా చేసుకొని దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను రూపొందించాడు. ఆయన స్టయిల్ లో తెరకెక్కించిన ఈ సినిమా మంచి సందేశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. స్మశానంలో పుట్టి, పెరిగిన వ్యక్తికి చావు అనేది ఒక సరదా. ఎదుటివారు చావు ఏడుపుల్లో తన సంతోషాన్ని చూసుకుంటాడు. ఇలాంటి ఓ సైకో కిల్లర్ అతడిని అంతం చేయాలని చూసే ఓ ఆఫీసర్ వీరిద్దరి మధ్యే కథ మొత్తం నడుస్తుంటుంది. సినిమా మొదటి భాగం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. విలన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు అతడి నేపధ్యం మరింత ఆకట్టుకుంటాయి. ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాపై క్యూరియాసిటీను పెంచేస్తాయి.

మొదటిభాగంలో చూపించే రోలర్ కోస్టర్ యాక్షన్ ఎపిసోడ్ ఉత్కంఠను క్రియేట్ చేస్తుంది. మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయార్ధం లో నేరేషన్ కాస్త స్లోగా అనిపిస్తుంది. ముప్పై అడుగుల బండరాయిని అడ్డుకునే ప్రయత్నం ఆసక్తిని కలిగిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ను మరింత సాంకేతికంగా తీర్చిదిద్దితే బాగుండేది. మురుగదాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కథనంతో ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. విలన్ ను హీరో తన తెలివితేటలతో ఎదుర్కొనే సన్నివేశాలు నమ్మశక్యంగా అనిపించవు. కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాయి.

సినిమాలో మహేష్ తనదైన నటనతో ఆడియన్స్ ను మెప్పించాడు. చాలా స్టైలిష్ గా మహేష్ పాత్రను డిజైన్ చేశారు. రకుల్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. విలన్ గా ఎస్.జె.సూర్య తన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. నిజంగా సైకో అంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సాంకేతికంగా సినిమా విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. పాటలు విసిగిస్తాయి. నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. మొత్తానికి ఈ స్పైడర్ అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం ఖాయం.
రేటింగ్: 3/5