చిరు సినిమాలో కన్నడ హీరో!

చిరంజీవి 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. చిరు పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్రిటీష్ వారితో పోరాడిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టైటిల్ గా కూడా ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ని పెట్టాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఇప్పుడు సినిమా ‘మహావీర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను సౌత్ లో ఉన్న భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా సినిమాలో నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. 
తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన నటీనటులను ఎన్నుకోవడం ద్వారా సినిమాకు మార్కెట్ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ ను చిరు సినిమా కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ‘ఈగ’,’బాహుబలి’ చిత్రాలతో పాపులర్ అయిన ఈ నటుడుకి డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో చిరు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సుదీప్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొణిదెల‌ ప్రొడక్షన్స్ కంపెనీలో రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ప‌లువురు బాలీవుడ్‌, కోలీవుడ్ న‌టులు ఎంపిక‌య్యారు. ఇప్పుడు క‌న్న‌డం నుంచి సుదీప్‌ని యాడ్ చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్లు ఎవరనే విషయంలో స్పష్టత రాలేదు.