మెరిట్‌ జాబితాలో ఉన్నది నేను కాదు..నా పేరున్న మరొకరు: సన్నీలియోన్‌

బిహార్‌ జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధించి విడుదల చేసిన మెరిట్‌ జాబితాలో సన్నీలియోన్‌ టాపర్‌గా నిలిచినట్లు వచ్చిన వార్త వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అది కాస్తా బాలీవుడ్ నటి సన్నీలియోని కంట పడింది. దీనిపై ఆమె ఒకింత ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్‌ ద్వారా స్పందించారు. తన పేరుతో ఉన్న మరొకరు మంచి మార్కులు సాధించినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ప్రముఖ ఆంగ్లమీడియాలో వచ్చిన కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ ‘హ్హ..హ్హ.. నాపేరు ఉన్న మరొకరికి మంచి మార్కులు వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అంటూ సన్నీ ట్వీట్‌ చేశారు. బిహార్‌లో జూనియర్‌ ఇంజినీరింగ్‌ పోస్టులను ప్రకటించగా 17వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి మెరిట్‌ జాబితాను సిద్ధం చేయగా టాపర్‌గా సన్నీలియోన్‌ అనే అభ్యర్థి పేరు వచ్చింది. అందులో ఆమె విద్యార్హత కింద 73.50, పని అనుభవం కింద 24శాతం పాయింట్లు కలిపి మొత్తం 98.50 సాధించినట్లుగా జాబితాలో ఉంది. ఆమె తండ్రి పేరు లియోనా లియోన్‌ అని ఉంది. అయితే కొందరు తప్పుడు పత్రాలు చూపించి కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పేరు ఉన్న అమ్మాయి నిజంగా ఉందా లేదా అనేది సర్జిఫికేట్‌ వెరిఫికేషన్‌ రోజు తేలుతుందని బిహార్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు