HomeTelugu Big Storiesఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను: చిరంజీవి

ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను: చిరంజీవి

13a 2‘నేను నటుడిని కావడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎస్వీ రంగారావు. ఆయన సినిమాలు చూసే నాలో నటించాలన్న కోరిక పుట్టింది’ అని అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. నట దిగ్గజం ఎస్వీ రంగారావుపై సంజయ్‌ కిషోర్‌ రాసిన ‘మహానటుడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా ఆరాధ్య నటుడు, అపారంగా అభిమానించే వ్యక్తి ఎస్వీ రంగారావుగారు. ఆయన పేరుమీద వచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఎస్వీఆర్‌, సావిత్రిగారు, కన్నాంబగారి నటనకు భూత, భవిష్యత్‌ వర్తమానాలు ఉండవు. వారిది సహజ నటన. ఎస్వీ రంగారావుగారి సినిమాలు చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ఒక ఎన్‌సైక్లోపిడియా. ఆయనపై అంత అభిమానం పెరగడానికి కారణం మా నాన్నగారు. నా చిన్నప్పుడు నాన్న నాటకాలు వేస్తుండేవారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయనెప్పుడూ మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించలేదు. అయితే, ఎస్వీఆర్‌తో కలిసి ‘జగజంత్రీలు’, ‘జగత్‌ కిలాడీలు’ చిత్రాల్లో చిన్న పాత్రలు వేసే అవకాశం వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎస్వీఆర్‌, ఆయన నటన గురించి నాన్న చెబుతుండేవారు. ఆ విధంగా రంగారావుగారి మీద అభిమానం పెరిగింది. నేను నటుడిని అవ్వాలని కోరిక కలగడం బహుశా అప్పుడే బీజం పడి ఉంటుంది. రామ్‌చరణ్‌ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు రంగారావుగారి సినిమాలు చూపించేవాడిని. ఈ పుస్తకం గురించి సంజయ్‌ కిషోర్‌ చేసిన ప్రయత్నం అభినందనీయం. ఇది ధనాపేక్ష కోసం ఆయన చేయలేదు. కళ మీద ఉన్న తపన, ఎస్వీఆర్‌ మీద ఉన్న అభిమానంతో ఈ పుస్తకం చేసినందుకు ఆయనను అభినందిస్తున్నా.

‘ఎస్వీ రంగారావుగారు తెలుగు నేలపై పుట్టడం ఆయన దురదృష్టం. అదే హాలీవుడ్‌లో పుట్టి ఉంటే ప్రపంచం గర్వించదగ్గ నటుడు అయ్యేవారు’ అని గుమ్మడిగారు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. అయితే, రంగారావుగారు తెలుగు నటుడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఇన్నేళ్లలో నేను కోల్పోయింది ఏదైనా ఉందంటే, నేను అభిమానించే నటుడిని ఒక్కసారి చూడలేకపోయాను. కలవలేకపోయాను. నాకు అది తీరనిలోటు. నా జీవితంలో ఎప్పటికీ అది ఒక లోటు. మహానటి సావిత్రిగారితో ‘పునాదిరాళ్లు’ లో చేయడం నా అదృష్టం. సంజయ్‌ తీసుకొచ్చిన పుస్తకంలోని ఆ ఫొటోలను చూస్తుంటే కాసేపు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి’ అని అన్నారు.

13 4

 

ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘సంజయ్‌ గతంలో పలు పుస్తకాలు వేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, ఇప్పుడు ఎస్వీ రంగారావుగారు. ఇందులో ఉన్న ఫొటోల గురించి బహుశా వాళ్లకు కూడా తెలిసి ఉండదు. నటనకు ఒక రూపం ఉంటే అదే ఎస్వీ రంగారావు. వాళ్లు చనిపోయిన, ఇన్నేళ్ల తర్వాత కూడా వారిని గుర్తు చేసుకుంటూ పుస్తకం విడుదలైందంటే అది వారి గొప్పతనానికి నిదర్శనం. ఎలాంటి పాత్ర అయినా పోషించడం ఆయనకు మాత్రమే తెలుసు. అలాంటి వ్యక్తుల గురించి పుస్తకం వేయాలన్న ఆలోచన సంజయ్‌కు రావడం నిజంగా అభినందనీయం. ‘సైరా’ బిజీ షెడ్యూల్‌లోనూ అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి రావడానికి చిరంజీవి ఒప్పుకొన్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, రావికొండలరావు, రోజా రమణి దితరులు పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu