నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధారవి .. తమిళనటులు ఫైర్‌

‘నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే.. క్షమించాలని కోరుతున్నా’ అని ప్రముఖ నటుడు రాధారవి అన్నారు. స్టార్‌ హీరోయిన్‌ నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, విశాల్‌, రాధిక, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, చిన్మయి, తాప్సి, సిద్ధార్థ్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన సీనియర్‌ నటుడు ఓ నటికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్‌ స్టూడియోస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై తమ సినిమాల్లో రాధారవిని తీసుకోమని స్పష్టం చేసింది. మిగిలిన వారు కూడా ఆయన్ను దూరంగా ఉంచాలని సలహా ఇచ్చింది. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.

దీనిపై రాధారవి స్పందించారు. ఈ మేరకు ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా మాటలు బాధించి ఉంటే.. నిజాయతీగా క్షమాపణలు కోరుతున్నా. నా వల్ల డీఎంకేకి సమస్యలు ఎదురౌతాయంటే నేను పార్టీను వదిలేస్తా’ అని చెప్పారు. మరోపక్క రాధారవి వ్యాఖ్యల్ని డీఎంకే నేత స్టాలిన్‌ ఖండించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు.