ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఫలితాలకు ముందు చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రకటించినప్పటికీ ప్రజల నాడిని తెలుసుకోలేక పోయారు. వైసీపీ మాత్రం ముందు నుంచీ విజయంపై ధీమాగా ఉంది. గురువారం వెల్లడైన ఫలితాల్లో ఏపీ అసెంబ్లీ మొత్తం 175 స్థానాలకు గాను 140 స్థానాలకు పైగా వైసీపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేశారు.

ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో మాట్లాడిన జగన్… ప్రజలు, దేవుడు వైసీపీని ఆశీర్వదించారని తెలిపారు. ఈ విజయం మేం ఊహించిందేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే మా అజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంపై స్పందించిన ఆయన… ప్రధాని మోడీకి శుభాకాక్షంలు తెలిపారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడనని దాటవేశారు వైఎస్ జగన్.

ఈ సందర్భంగా తిరుగులేని విజయం సాధించినందుకు ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశమంతా ఫలితాలు వచ్చాయి. లెక్కింపు పూర్తయింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం అందరి బాధ్యత. వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు.. శుభాకాంక్షలు. కేంద్రంలో గెలిచిన బీజేపీ, మోడీకి శుభాకాంక్షలు. ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ గెలవడం పట్ల మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకూ మనస్ఫూర్తిగా అభినందనలు. పార్టీపై అభిమానంతో ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను సమీక్షించుకుంటాం అని చంద్రబాబు అన్నారు.