తేజ టార్గెట్.. స్టార్ హీరోనే!

చాలా కాలం పాటు విజయాలు లేకపోవడంతో దర్శకుడు తేజ కెరీర్ అగాధంలో పడింది. దీంతో ఈసారి తన రూట్ మార్చి ఓ పొలిటికల్ త్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేమకథలను తెరకెక్కించే దర్శకుడు తేజ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదని అతడి క్రియేటివిటీను ఆకాశానికి ఎత్తేశారు. అందుకే ఇప్పుడు తేజ కూడా తన రూట్ ను మార్చినట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే కొత్తవాళ్లతో సినిమాను చేస్తారా..? అని తేజను ప్రశ్నించగా, సమస్యే లేదని అనేశాడు. ఇంకా కథలు సిద్ధం చేసుకోలేదు కానీ ఖచ్చితంగా స్టార్ హీరోతో సినిమా చేస్తానని వెల్లడించారు.
ఇదే ప్రశ్నను ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా రిలీజ్ కు ముందు ప్రశ్నిస్తే.. అప్పుడు సమాధానం చెప్పకుండా దాటేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఓ పెద్ద హీరోతో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. అది పూర్తయిన వెంటనే ఆ స్టార్ హీరో ఎవరనే విషయాన్ని వెల్లడిస్తానని అన్నారు. అలానే తన బ్యానర్ లో కొత్త వాళ్ళతో సినిమాలు నిర్మిస్తానన్నారు. తనే స్వయంగా కొత్త దర్శకులను పరిచయం చేస్తానని స్పష్టం చేశారు.