‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ రివ్యూ

Thank You Brother Reviewతెలుగు బుల్లితెర యాంకర్‌, నటి అనసూయ నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. కరోనా కారణంగా థియేటర్స్‌ మూతబడటంతో ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదలైంది.

కథ: అభి(విరాజ్‌ అశ్విన్‌) తన తండ్రి స్నేహితుడు(సమీర్‌)తో కలిసి వ్యాపార భాగస్వామిగా చేరతానని కోరడానికి గోల్డ్‌ఫిష్‌ అపార్ట్‌మెంట్‌కు వస్తాడు. మరోవైపు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త(ఆదర్శ్‌ బాలకృష్ణ) చనిపోవడంతో అతను పనిచేసే కంపెనీ నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రియ(అనసయా భరద్వాజ్‌) కూడా అదే అపార్ట్‌మెంట్‌కు వస్తుంది. పైగా ఆమె నిండు గర్భిణి. అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ఇద్దరూ ఒకేసారి లిఫ్ట్‌ ఎక్కుతారు. సడెన్‌గా లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి ఆగిపోతుంది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రియకు నొప్పులు ప్రారంభమవుతాయి. అలాంటి టైమ్‌లో అభి ఏం చేశాడు? లిఫ్ట్‌లో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అనేది కథలోని అంశం.

ఎలా ఉందంటే: దర్శకుడు సరికొత్త ఆలోచనతో ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ సినిమాలను తెరకెక్కించాడు. సాధారణంగా లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా కరెంట్ పోతే అది పనిచేసే వరకూ అందులో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ తెలియని ఆందోళన నెలకొంటుంది. అదే నిండు గర్భిణి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే, అదే సమయంలో ఆమెకు నొప్పులు మొదలైతే, ఇదే చిన్న ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ను తీసుకుని కథగా మలుచుకున్నాడు దర్శకుడు రమేశ్‌. ఇలాంటి సినిమాలకు బిగిసడలని కథనం తోడైతే ఆ సినిమా హిట్టయినట్టే. ఈ విషయంలో దర్శకుడు రమేశ్‌ కొంత వరకే సఫలమయ్యాడు.

ప్రథమార్ధమంతా అభి, ప్రియల నేపథ్యం చూపించేందుకు సమయం తీసుకున్నాడు. ఈ సన్నివేశాలు కాస్త విసుగు తెప్పిస్తాయి. ముఖ్యంగా అభి ఎపిసోడ్‌ తరహా సన్నివేశాలు చాలా సినిమాల్లో చూశాం. అభి, ప్రియలు లిఫ్ట్‌లో ఇరుక్కున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అప్పటివరకూ అభి, ప్రియల ఫ్లాష్‌బాక్‌ అంతా భరించాల్సిందే. లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. ద్వితీయార్ధం అంతా లిఫ్ట్‌లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో సాగుతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఆసక్తిగా సాగుతాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాడు దర్శకుడు.

నటీనటులు: అనసూయ.. నిండు గర్భిణిగా ప్రియ పాత్రలో ఒదిగిపోయింది. లిఫ్ట్‌లో పురుటినొప్పులతో బాధపడే సన్నివేశాలు భావోద్వేగంగా ఉన్నాయి. యంగ్‌ హీరో విరాజ్‌ పర్వాలేదనపించాడు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికవర్గం పనితీరు బాగుంది. ముఖ్యంగా లిఫ్ట్‌ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలకు మరింత బలం తీసుకొచ్చింది. డైరెక్టర్‌ రమేశ్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదే. అయితే, దాన్ని ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దడంలో తడబడ్డాడు. అభి, ప్రియల ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలను త్వరగా ముగించి, అసలు పాయింట్‌ అయిన లిఫ్ట్‌ సన్నివేశాలపై దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో థ్రిల్లర్‌గా అలరించేది. ప్రస్తుతం థియేటర్‌లు తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి, వీకెండ్‌లో కాలక్షేపం కోసం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ చూడొచ్చు.

టైటిల్: థ్యాంక్‌ యు బ్రదర్‌
న‌టీన‌టులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అనీశ్‌ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ
ద‌ర్శ‌క‌త్వం: రమేశ్ రాపర్తి
నిర్మాత : మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
సంగీతం: గుణ బాలసుబ్రమణియన్

హైలైట్స్: అనసూయ, విరాజ్ అశ్విన్ నటన

డ్రాబ్యాక్స్: సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్‌
చివరిగా: ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ ఓసారి చూడొచ్చు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates