మహా కూటమిలో అసంతృప్తుల జ్వాల

మహా కూటమి ఏర్పాటులో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 25 స్థానాలను కాంగ్రెస్ మిత్రపక్షాలకు వదిలి 94 స్థానాల్లో పోటీకి దిగుతోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా 75 మంది అభ్యర్థులతో జాబితాలను విడుదల చేసింది. కొన్నిచోట్ల అసంతృప్తుల జ్వాల రగిలింది. మరోవైపు కొన్ని స్థానాలను తెలంగాణ జనసమితి పార్టీ పట్టుబట్టడం కాంగ్రెస్‌ను కాస్త ఇరకాటంలో పడేసింది. అందుకే మూడో జాబితా విడుదలకు తీవ్ర స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిగాయి. మహకూటమికి కోదండరామ్‌ కన్వీనర్‌గా ఉన్నారు.

తుది జాబితా సిద్ధమైందని కాంగ్రెస్ ప్రకటించింది. అసంతృప్తులతో రాహుల్‌గాంధీ చర్చించారని, టిక్కెట్లు దక్కనివారు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమేనని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజ్ అన్నారు. రేపు తుది జాబితా విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అందరినీ సంతృప్తిపరిచేలా కాంగ్రెస్ టిక్కట్ల కేటాయింపు ఉంటుందని కుంతియా వివరించారు. టీజేఎస్ 12 స్థానాల్లో పోటీ చేసినా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అన్నారు. పొత్తులు కొలిక్కి వచ్చాయని..కాంగ్రెస్ 94 చోట్ల పోటీ చేస్తుందని తెలిపారు. మహాకూటమికి కోదండరామ్ కన్వీనర్‌గా ఉన్నందున తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీతో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని కుంతియా వివరించారు. అలాగే పార్టీలోని సీనియర్లను విస్మరించబోమని, సీనియర్ నాయకుడైన పొన్నాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కుంతియా అన్నారు.