రజనీ ఎంట్రీ సన్నివేశం కోసం సినిమాను ఆపేశారు!

 

రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. తమిళనాడులో ఓ థియేటర్‌లో రజనీ ఎంట్రీ సన్నివేశాన్ని సెలబ్రేట్‌‌ చేసుకోవడం కోసం సినిమా ప్రదర్శనే ఆపేశారట. స్థానిక థియేటర్‌లో ‘2.ఓ’ సినిమా మొదలైనప్పుడు తలైవా ఎంట్రీ సన్నివేశం చూడగానే అభిమానులు తెగ గోలచేశారు. ఆయన ఎంట్రీ సన్నివేశాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు సినిమాను మూడు నిమిషాల పాటు నిలిపివేయమని థియేటర్‌ సిబ్బందిని కోరారు. ఇందుకు వారు కూడా ఒప్పుకుని కొంతసేపు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.. ఎంట్రీ సీన్‌ను చూసి అభిమానులు సందడి చేస్తున్న వీడియోలను రజనీ అభిమానులు ట్విటర్ వేదికగా షేర్‌ చేస్తున్నారు.

మరి కొన్ని థియేటర్ల వద్ద ఉదయం 4 గంటలకే అభిమానులు రజనీ కటౌట్లకు పాలతో అభిషేకాలు చేయడం మొదలుపెట్టారు. మరికొందరు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. చెన్నైలోనే కాదు అటు ముంబయిలోనూ రజనీకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. అక్కడ కూడా ‘2.ఓ’ సినిమాను ఫస్ట్‌షోలో చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ‘2.ఓ’ సినిమాను అభిమానులు ఓ పండగలా జరుపుకొంటున్నారు.