HomeTelugu Trendingఈసారైనా తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తారా?

ఈసారైనా తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తారా?

తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌ పాలమూరులో నిర్వహించిన బీజేపీ శంఖారావం సభలో అమిత్‌ షా పాల్గొని తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జమిలీ ఎన్నికలను సిద్ధమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ స్వార్ధపూరిత ఆలోచన వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన చూశాక ఆ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని అనుకోవడం లేదని అన్నారు. మూఢనమ్మకాలతో సచివాలయానికి వెళ్లని వ్యక్తిని మరోసారి గెలిపించి రాష్ట్రంలో రజాకార్ల పాలనను ఆహ్వానిస్తారా అన్నారు అమిత్ షా.

10b 1

గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని అమిత్ షా ఆరోపించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లని.. దళితులకు మూడెకరాల భూమి అని అన్నారు.. కానీ ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి మీరు మాత్రం పదెకరాల్లో ప్రగతి భవన్‌ పేరుతో గడీ కట్టుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా కేసీఆర్ విఫలమయ్యారని, ఈసారైనా దళితుడిని సీఎం చేస్తానన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవాలంటే తన మిత్రుడైన అసదుద్దీన్‌కు కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు.

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి రిజర్వేషన్లు తగ్గించి మైనారిటీలకు పెంచుతారో వివరించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పలు పథకాల అమలు కోసం కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి లక్షా పదిహేను వేల కోట్ల నిధులిచ్చామని, వాటన్నింటిని ఎలా ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని అమిత్ షా డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో 30 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం ప్రధాని మోడీ సహకారంతోనే పూర్తయిందని అమిత్ షా తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!