రచయితకు బెదిరింపు లేఖ!

కేరళ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మలయాళం రచయిత కేపీ ర‌మ‌నుణ్నికి గుర్తు తెలియని వ్యక్తులు ఓ లేఖను పంపారు. ఆ లేఖలో ఆరు నెలల్లో ఇస్లాం మతంలోకి మారాలని వారు బెదిరించారు. అలా చేయని పక్షంలో కుడి చేయి, ఎడమ కాలు నరికేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ వచ్చి ఆరు రోజులు అవుతుండగా సీనియర్ రచయితల సలహా మేరకు ర‌మ‌నుణ్ని కోజీకోడ్ ప్రాంతపు పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ లేఖ కేరళలోని మలప్పురం జిల్లాలో మంజేరీ ప్రాంతం నుండి వచ్చినట్లు సమాచారం.
ఇటీవల ర‌మ‌నుణ్ని రాసిన వ్యాసాలు ముస్లిం యువత తప్పుదోవ పడుతోందని అర్ధం వచ్చే విధంగా ఉండడంతో ఆయనకు ఇలాంటి బెదిరింపు ఉత్తరాలు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ముస్లిం మతాచారాలను కించపరిచే విధంగా ప్రశ్నాపత్రం తయారు చేశాడనే నెపంతో కొందరు ముస్లిం రాడికల్ వాదులు తోలుపుర న్యూమ్యాన్ కళాశాల అధ్యాపకుడు టీఎస్ జోసెఫ్ కుడి భుజం నరికేశారు. ఇప్పుడు ఆరు నెలల్లో ముస్లింగా మారకపోతే అల్లా ఆదేశానుసారం టీఎస్ జోసెఫ్ కు పట్టిన గతే ర‌మ‌నుణ్నికి కూడా పడుతుందని లేఖలో పేర్కొన్నారు.