విడుదల కాని ఈ చిత్రానికి 26 అంతర్జాతీయ అవార్డులా..!


తమిళంలో దర్శకుడు చెలియన్‌ తెరకెక్కించిన చిత్రం “టూలెట్‌”. ఈ చిత్రంలో సంతోష్‌ శ్రీరామ్‌, సుశీల, ఆదిరా పాండిలక్ష్మి, ధరుణ్‌ బాలా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, కథను చెలియన్‌ అందించారు. ఇంకా విడుదల కాని ఈ సినిమా ఇప్పటి వరకు 80 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్‌ అయ్యింది. 26 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. చెన్నైలో అద్దె ఇంటిని వెతకడానికి ఓ కుటుంబం పడే కష్టాల్ని ఈ సినిమాలో దర్శకుడు ఎంతో సహజంగా చూపించారు.

సహాయ దర్శకుడిగా పనిచేసే సంతోష్‌ శ్రీరామ్‌కు ఓ అద్దె ఇల్లు దొరకడం సవాలుగా మారుతుంది. నగరంలో అద్దె ఇళ్లు ఉన్నప్పటికీ.. ఎన్నో షరతులు విధిస్తారు. ట్రైలర్‌ చివర్లో సంతోష్‌ శ్రీరామ్‌ కుమారుడు మనకు మోటర్‌ సైకిల్‌ ఉంది, టీవీ ఉంది.. ఇల్లు ఎందుకు లేదు? అని ప్రశ్నిస్తూ కనిపించాడు. ఈ ట్రైలర్‌కు తమిళనాడు నుంచి మంచి స్పందన లభిస్తోంది. నిజంగా అక్కడి పరిస్థితుల్ని దర్శకుడు చూపించారంటూ నెటిజన్లు యూట్యూబ్‌లో కామెంట్లు చేస్తున్నారు. “టూలెట్‌” ట్రైలర్‌ చాలా బాగుందని కథానాయకుడు సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు. మంచి సినిమాకు అందరి ఆదరణ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. చెలియన్‌కు‌ సినిమాటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఫిబ్రవరి 21న వివిధ భాషల్లో “టూలెట్‌” చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.