‘ట్యూబ్‌లైట్’ తో ఎంత పోయిందంటే!

సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వెల్లువ ఖాయం. ఆయన సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. సరే వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. అదీ సల్మాన్ ఖాన్ స్టామినా. గతంలో ‘బాడీగార్డ్’ వంటి సినిమాలకు క్రిటిక్స్ నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు సల్మాన్ స్థాయిని నిరూపించాయి. ట్యూబ్‌లైట్ కు కూడా మొదటి రోజు నుండి డివైడ్ టాక్ రావడంతో సల్మాన్ క్రేజ్ తో దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో సల్మాన్ ఖాన్ తన మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. 
సినిమా హిట్ అయినప్పుడు వసూళ్ల విషయంలో ఎంత పెద్ద నంబర్స్ వినిపిస్తాయో.. ఇప్పుడు నష్టాల విషయంలో కూడా అంతే పెద్ద నంబర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దగ్గర దగ్గరగా 40 నుండి 50 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారం మొత్తం డిస్ట్రిబ్యూటర్ల మీదే పడనుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ బాలీవుడ్ సినిమాకు కూడా ఈ రేంజ్ లో నష్టాలు రాలేదు. సాధారణంగా సల్మాన్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లో వంద కోట్లు వసూలు చేసేస్తుంది కానీ ట్యూబ్‌లైట్ మాత్రం వంద కోట్ల మార్కు చేరుకోవడానికి వారం రోజులు పట్టింది. ఇక ఇప్పటికీ కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. మరి ఈ మొత్తం నష్టాలను డిస్ట్రిబ్యూటర్లతో పాటు నిర్మాతలు కూడా భరిస్తారేమో చూడాలి!