హత్య కేసులో ప్రముఖ నటి ‘గోపిక’

ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారి రాజేశ్వర్‌ ఉడాని అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసులో రాజకీయ నాయకుడు సచిన్‌ పవార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, టీవీ నటి దెవోలినా భట్టాచార్యను విచారణ నిమిత్తం పోలీసు స్టేషనుకు పిలిపించారు. సుమారు రెండు గంటల పాటు ఆమెను విచారించారు. దెవోలినాతో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులను విచారించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వివరాలు… రాజేశ్వర్‌ ఉడాని గత వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డిసెంబరు 5న ఆయన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవుల్లో లభ్యమైంది. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేశ్వర్‌ కాల్‌డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే దెవోలినా భట్టాచార్యను విచారించినట్లు తెలుస్తోంది.

కాగా, సచిన్‌ పవార్‌ ద్వారా పలువురు మహిళలతో రాజేశ్‌కు పరిచయం ఏర్పడింది. సినీ ఇండస్ట్రీ మహిళలు, బార్‌ డాన్సర్లతో అతడు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాడని కాల్‌డేటా ఆధారంగా వెల్లడైంది. ఇక ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న దెవోలినా.. ప్రముఖ హిందీ చానల్‌లో ప్రసారమైన ‘సాథ్‌ నిబానా సాథియా’ సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఈ సీరియల్‌లో నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు కూడా దక్కించుకుంది. తెలుగులో డబ్‌ అయిన ఈ సీరియల్‌ ద్వారా ‘గోపిక’ గా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది.

CLICK HERE!! For the aha Latest Updates