శివగామిగా బాలీవుడ్‌ మోడల్‌‌..!

రాజమౌళి సృష్టించిన అద్భుత సృష్టి ‘బాహుబలి’. ఈ సినిమా దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది.

ఆనందన్ నీలకంఠన్ రచించిన పుస్తకం ‘రైజ్ ఆఫ్ శివగామిని’ ఆధారంగా ఈ సీరీస్ ను నిర్మిస్తున్నారు. దర్శకులు ప్రవీణ్ సత్తారు.. దేవాకట్టాలు ఈ సీరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ భారీ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సిరీస్ ను నిర్మించేందుకు నెట్ ఫ్లిక్స్ సిద్ధమైంది. మొదటి సీజన్ లో 9 ఎపిసోడ్స్ ఉంటాయట. రైజ్ ఆఫ్ శివగామిని 90 భాషల్లో డబ్ చేసి ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తున్నది. ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్‌ థాకూర్‌ కనిపించనున్నారట. సిల్వర్‌ స్క్రీన్‌పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. శివగామి పాత్రలో మృణాల్‌ కనిపించటం ఖరారయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. కుంకుమ్‌ భాగ్య సీరియల్‌లో బుల్ బుల్‌ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ప్రస్తుతం హృతిక్ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న సూపర్‌ 30లో నటిస్తున్నారు.