హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య


బుల్లితెర సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. పంజాగుట్ట ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్ట పీఎస్ పరిధిలోని నాగార్జుననగర్‌ సాయిరాం రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఆమె బ్యూటీ పార్లర్‌ కూడా నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్య అనే కుటుంబ స్నేహితుడితో ఝాన్సీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

గత నాలుగైదు రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు సోదరుడు దుర్గాప్రసాద్‌ తెలిపారు. మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్‌ ఇంటికి వచ్చాక తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అప్పటికే ఝాన్సీ మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.