నా పాత్ర చేసేందుకు ఇద్దరు టాప్‌ హీరోయిన్లు కాదన్నారు: సమంత

‘సూపర్‌డీలక్స్‌’ లోని తన పాత్రను ఇద్దరు టాప్‌ హీరోయిన్లు తిరస్కరించారని స్టార్‌ హీరోయిన్‌ సమంత చెప్పారు. ఆమె, విజయ్‌ సేతుపతి, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకుడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. మార్చి 29న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌ అంచనాలను పెంచింది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా సామ్‌ ఓ పత్రికతో మాట్లాడారు. సినిమాలో తను పోషించిన ‘వేంబు’ పాత్ర గురించి ప్రస్తావించారు. ‘నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో నటించేందుకు ఇద్దరు అగ్ర నటీమణులు నిరాకరించారు. తర్వాత ఆ అవకాశం నాకు దక్కింది. తొలుత నేనూ కాస్త భయపడ్డా. తర్వాత దాన్నే స్ఫూర్తిగా తీసుకున్నా. కానీ ఇప్పుడు ఆ పాత్రలో నటించినందుకు గర్వపడుతున్నా. ఓ మధ్యతరగతి అమ్మాయి పాత్ర ఇది. ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో కూర్చుని నేను ఎంజాయ్‌ చేయగలిగే సినిమాలకే నేను సంతకం చేయడానికి ప్రాధాన్యం ఇస్తా. లెక్కలు వేసుకోవడం ఎప్పుడో మానేశా. ఛాలెంజింగ్‌గా ఉన్న వాటిని ఎంచుకుంటున్నా. నేను ఏ పాత్రకు భయపడుతానో.. దానికే సంతకం చేస్తా. ‘సూపర్‌ డీలక్స్‌’ లోని నా పాత్ర కూడా అలాంటిదే’ అని సామ్‌ చెప్పారు.

మరోపక్క సమంత, నాగచైతన్య జంటగా నటించిన ‘మజిలీ’ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కాబోతోంది. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాలో సామ్, చైతన్య భార్యాభర్తల పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు విశేషమైన స్పందన లభించింది. మరోపక్క సామ్‌- దర్శకురాలు నందినిరెడ్డి కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని సామ్‌ ప్రకటించారు. ఇది వినోదాత్మకంగా సాగే చిత్రమని తెలిపారు.