రివ్యూ: ఉంగరాల రాంబాబు

నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫి: సర్వేష్ మురారి, శ్యామ్ కె నాయుడు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాత: పరుచూరి కిరీటి
దర్శకత్వం: క్రాంతి మాధవ్
హీరోగా వరుస పరాజయాలు పొందుతోన్న సునీల్ నటించిన తాజా చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
ఉంగరాల రాంబాబు(సునీల్) తన తాతయ్య దగ్గర పెరుగుతుంటాడు. కొన్నేళ్లకు తన తాతయ్య చనిపోతారు. అతడితో పాటు ఆస్తి కూడా పోతుంది. అదే సమయంలో రాంబాబుకి బాదం బాబా(పోసాని కృష్ణమురలి) ఆశ్రమం కనిపిస్తుంది. ఆ బాబా సహాయంతో రాంబాబుకి 200 కోట్లు విలువ చేసే బంగారం దొరుకుతుంది. అప్పటినుండి జాతకాలను నమ్మడం మొదలుపెడతాడు రాంబాబు. తన జాతకానికి సెట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాంబాబుకి చెబుతాడు బాదం బాబా. తన ఆఫీస్ లో పనిచేస్తోన్న సావిత్రి(మియాజార్జ్) ఆ జాతకం గల అమ్మాయని తెలుసుకున్న రాంబాబు ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. మరి నిజంగా సావిత్రిది బాబా చెప్పిన జాతకమేనా..? వారి ప్రేమ సక్సెస్ అయిందా..? ఇంతకీ రాంబాబుకి దొరికిన 200 కోట్లు బంగారం ఎవరిది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
ఎప్పటిలానే ఈసారి కూడా సునీల్ రొటీన్ స్టోరీను ఎంపిక చేసుకున్నాడు. అయితే సినిమా చూసిన తరువాత క్రాంతి మాధవ్ వంటి దర్శకుడు ఈ సినిమా కథ రాసుకున్నాడా..? అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. సునీల్ గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే పరమ రొటీన్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. సునీల్ లాంటి కామెడీ హీరోను పెట్టుకొని ఒక్క సరైన కామెడీ పంచ్ ను కూడా రాయలేకపోయారు.

హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పరమ వీక్ గా ఉంది. ఇండియా నుండి దుబాయి అని చెప్పి బ్యాంకాక్ లో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాను పక్కదారి పట్టిస్తాయి. హీరో, హీరోయిన్ మధ్య ఒక సీన్ రావడం పాట అందుకోవడం సినిమా మొత్తం ఇదే తంతు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. అప్పటివరకు ఏదొక స్పూర్తి కావాలని పరితపించే హీరో వెంటనే జాతకాలు, బాబాలు అంటూ తిరుగుతాడు. ఇక సెకండ్ హాఫ్ లో తన ప్రేమ కోసం ఆస్తి మొత్తాన్ని ఊరి ప్రజల కోసం రాసిచ్చేస్తాడు. 

రొటీన్ లో రొటీన్ ఫస్ట్ హాఫ్ అంతకు మించి విసిగించే సెకండ్ హాఫ్ అన్నీ కలిపి ఆడియన్స్ పై పగ తీర్చుకోవడం ఖాయం. అసలు క్రాంతి మాధవ్ కథలో కానీ కథనంలో కానీ ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. ప్రకాష్ రాజ్ లాంటి నటుడిని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు సైతం విసిగిస్తుంది. మియా జార్జ్ ఉన్నంతలో బాగానే నటించింది. పోసానితో వెన్నెల కిషోర్ లతో ట్రై చేసిన కామెడీ పెద్దగా పండదు.
 
టెక్నికల్ గా కూడా సినిమా చాలా వీక్ ఉంది. ఎడిటింగ్ వర్క్ అసలు బాగాలేదు. పాటల సంగతి ఇక చెప్పుకోనక్కర్లేదు. కాస్తో కూస్తో సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి సునీల్ మరోసారి ఆడియన్స్ ను విసిగించడంలో సక్సెస్ అయ్యాడు. 
రేటింగ్: 1.5/5