‘నాతో సెల్ఫీ దిగవా.. నీ ప్రేయసి నటాషాను చంపేస్తాను’ వరుణ్‌ ధావన్‌కు ఓ అభిమాని బెదిరింపులు


బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌కు ఓ అభిమాని నుంచి బెదిరింపులు వచ్చాయి. వరుణ్‌ తన అభిమానులతో ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. వారు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు అడిగినా విసుక్కోకుండా ఇస్తుంటారు. అయితే శుక్రవారం సాయంత్రం ఓ యువతి వరుణ్‌ ఇంటి ముందు హడావుడి చేసింది. వరుణ్‌ను చూడాలని, అతనితో కలిసి సెల్ఫీ దిగాలన్నది ఆమె కోరికట. దాంతో ఆమె వరుణ్‌ నివసిస్తున్న జుహు ప్రాంతంలోని ఫ్లాట్‌ వద్ద దాదాపు కొన్ని గంటల పాటు అతని కోసం వేచి చూసింది. వరుణ్‌ షూటింగ్‌ నిమిత్తం బయటికి వెళ్లారని, రావడానికి ఆలస్యమవుతుందని సెక్యూరిటీ సిబ్బంది ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. ఆ తర్వాత కొంతసేపటికి వరుణ్‌ తన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోయి ఉండటంతో అభిమానిని కలవకుండా వ్యానిటీ వ్యాన్‌ నుంచి దిగి నేరుగా తన ఫ్లాట్‌కు వెళ్లిపోయారు.

ఈ విషయం తెలిసి సదరు అభిమాని రచ్చ చేసింది. తన కోసం వరుణ్‌ రాకపోతే తనని తానే గాయపరుచుకుంటానని బెదిరించింది. అంతటితో ఆగకుండా ‘నాతో సెల్ఫీ దిగవా.. నీ ప్రేయసి నటాషాను చంపేస్తాను. తనని ఏం చేస్తానో చూడు’ అంటూ బెదిరింపులకు పాల్పడింది. దాంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు వరుణ్‌ ఫ్లాట్‌ వద్దకు చేరుకుని యువతికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ‘వరుణ్‌ సర్‌ అభిమానులు ఎప్పుడూ ఇంత ఆవేశంగా ప్రవర్తించలేదు. అలాంటిది ఆమె నటాషా మేడమ్‌కు హాని తలపెడతానని బెదిరిస్తుండడంతో మాకు భయం వేసింది. అందుకే పోలీసులకు ఫోన్‌ చేశాం’ అని సెక్యూరిటీ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే వరుణ్‌ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. వరుణ్‌.. చాలా కాలంగా ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌తో డేటింగ్‌లో ఉన్నారు. 2020లో వీరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.