జనసేనకు వరుణ్‌, నాగబాబు భారీ విరాళం..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తన సోదరుడు నాగబాబుకు, ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ జనసేన పార్టీకి విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో పవన్‌ మాట్లాడారు. ‘జనసేన పార్టీకి రూ.కోటి విరాళం ఇచ్చిన వరుణ్‌తేజ్‌కు, రూ.25 లక్షలు అందించిన నాగబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది పార్టీకి సర్‌ప్రైజ్ క్రిస్మస్‌‌ బహుమతిలా వచ్చింది. మీరిద్దరూ విరాళాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. నేను తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతాను’ అని పవన్‌ పోస్ట్‌లో తెలిపారు.

అంతేకాదు పవన్‌ ఇదే సందర్భంగా అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రిస్మస్‌ అందరి జీవితాల్లో సుఖసంతోషాల్ని నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన ఇంటిలో క్రిస్మస్‌ ట్రీను అలంకరించిన ఫొటోను షేర్‌ చేశారు. పవన్‌ ఇటీవల కుటుంబంతో కలిసి యూరప్‌ వెళ్లారు. క్రిస్మస్‌ పండుగ తర్వాత ఆయన హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఇటీవల పవన్‌ తల్లి అంజనాదేవి రూ.4లక్షలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.