నేను ముందే ఉన్నా అమ్మ గుర్తుపట్టలేకపోయింది: సారా

బాలీవుడ్‌ నటి సారా అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్‌, అమృతా సింగ్‌ల కూతురు సారా. ‘కేదార్‌నాథ్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. తన తల్లిదండ్రుల్లాగే సినిమా పరిశ్రమలోకి రావాలని నిర్ణయించుకున్న సారా ఎంతో కష్టపడి బరువు తగ్గారట. సన్నగా మారిపోయేసరికి తన తల్లి గుర్తుపట్టేలేకపోయారట.

ఈ విషయాన్ని సారా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నేను అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నేను 96 కిలోల వరకు బరువు పెరిగిపోయాను. అదీకాకుండా అమెరికాలో చాకొలెట్లు, పిజ్జాలు ఎక్కువగా తినే సరికి బొద్దుగా అయిపోయాను. నాకు నటి అవ్వాలనుంది అని అమ్మకు చెబితే.. ‘ముందు నువ్వు బరువు తగ్గాలి’ అని చెప్పింది. దాంతో ఏడాదిన్నర పాటు కష్టపడి వర్కవుట్లు చేసి బరువు తగ్గాను. అదే సమయంలోనే నా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాను. అమెరికాలోనే బరువు పెరిగాను కాబట్టి అక్కడే ఆ కొవ్వంతా కరిగించేసుకున్నాను. నేను భారత్‌కు వస్తున్నప్పుడు అమ్మ నాకోసం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. నేను తన ముందే నిలబడి ఉన్నా కూడా నన్ను చూసి గుర్తుపట్టలేకపోయింది. నా చేతిలో ఉన్న సూట్‌కేస్‌లు చూసి గుర్తుపట్టింది. ఎందుకంటే ఈ బరువు తగ్గే ప్రక్రియ, చదువులో పడి మా అమ్మతో కనీసం ఫేస్‌టైం ద్వారా కూడా మాట్లాడేదాన్ని కాదు. అలా రెండున్నరేళ్ల పాటు నన్ను చూడకపోవడంతో గుర్తుపట్టలేదు.’ అని చెప్పుకొచ్చారు సారా. ప్రస్తుతం సారా తన రెండో సినిమా ‘సింబా’ తో బిజీగా ఉన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates