జాన్వితో నటిస్తా: దేవరకొండ


బాలీవుడ్‌ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌తో తప్పకుండా నటిస్తానని అంటున్నారు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్’ కార్యక్రమంలో ఇటీవల జాన్వి కపూర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్‌.. ‘ఓ రోజు ఉదయం నటుడిగా నిద్రలేచే అవకాశం వస్తే.. నువ్వు ఏ నటుడిగా మారాలని అనుకుంటున్నావు? ఎందుకు?’ అని జాన్విని ప్రశ్నించారు. ఇందుకు జాన్వి సమాధానమిస్తూ.. ‘విజయ్‌ దేవరకొండ. నాకు అతనితో కలిసి నటించాలని ఉంది’ అన్నారు.

ఈ విషయం గురించి విజయ్‌ ఓ ఆంగ్ల మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘నేను కూడా జాన్వితో, కరణ్‌ జోహార్‌తో కలిసి అతి త్వరలో పనిచేస్తాను’ అని తెలిపారు. విజయ్‌ కరణ్‌ జోహార్‌ను కలిసేందుకు ఇటీవల ముంబయి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. ‘టాక్సీవాలా’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఓసారి నేను ముంబయిలోని కరణ్‌ జోహార్ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు నేనేంటి ఇక్కడ? అనిపించింది’ అని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే విజయ్‌, కరణ్‌ జోహార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇటీవల ‘టాక్సీవాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. భరత్‌ కమ్మా దర్శకత్వం వహిస్తున్నారు.