తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’.!

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘ద్వారక’ చిత్రం ఇప్పుడు తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’గా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ పేరు బాగా సుపరిచితం కావడంతో ఈ సినిమాకు అదే పేరును పెట్టినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. పూజ జవేరి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌, ప్రభాకర్‌, మురళీ శర్మ, సురేఖలు ఇతర తారాగణం. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించారు. సాయికార్తిక్‌ సంగీతం సమకూర్చారు. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి ఏఎన్‌ బాలాజీ మాట్లాడుతూ ‘ద్వారాక’ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ పేరుతో తమిళంలో అనువాదం చేశాం. ప్రేమ, యాక్షన్‌, కమర్షియల్‌ వంటి అంశాలన్నీ కలగలిసిన సినిమా ఇది. త్వరలోనే పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, పలువురు సినీ ప్రముఖులు ఇందులో అతిథులుగా హాజరుకానున్నారని’ పేర్కొన్నారు.