మహేశ్‌ బాబు సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న విజయశాంతి!

ఒక‌ప్పుడు తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ స‌త్తా చూపించిన న‌టి విజ‌య‌శాంతి. ఎన్నో వంద‌ల సినిమాల్లో న‌టించిన విజ‌య‌శాంతి.. కొన్నేళ్లుగా రాజ‌కీయాల్లో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాముల‌మ్మ‌. ప్రస్తుతం కూడా రాజ‌కీయాలతోనే బిజీగా ఉంది ఈమె. విజ‌య‌శాంతి కూడా కాంగ్రెస్ ప్ర‌చార ప‌నుల్లో బిజీగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఈమె మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే విజయశాంతి మ‌రోసారి వెండితెరపై మెర‌వడం ఖాయంగా క‌నిపిస్తుంది. దీనికోసం ఇప్ప‌టికే తెర‌వెన‌క ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి.

మహేశ్‌ బాబు సినిమాతోనే విజయశాంతి ఎంట్రీ ఇస్తుంద‌ని తెలుస్తుంది. మ‌హేశ్‌ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ప‌క్కా అనిల్ రావిపూడి పంథాలోనే ఈ చిత్రం సాగ‌నుంది. ఇందులో మ‌హేశ్‌ బాబు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఇక ఈ చిత్రంలో ఓ ఎంటర్‌టైనింగ్ రోల్ కోసం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.. విజయశాంతిని సంప్రదించినట్టు తెలుస్తుంది.

చాలా రోజుల నుంచి మంచి పాత్ర వ‌స్తే మ‌ళ్లీ న‌టించాల‌ని చూస్తున్న విజ‌య‌శాంతికి అనిల్ చెప్పిన పాత్ర బాగా న‌చ్చేసింద‌ని తెలుస్తుంది. అందుకే ఈమె కూడా మ‌హేశ్‌ బాబు సినిమాలో న‌టించ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై పూర్తి వివ‌రాలు బ‌య‌టికి కానున్నాయి. దిల్ రాజుతో క‌లిసి ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాడు. ఈ సినిమాలో విజయశాంతితోపాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషించనున్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా నటించిబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.