HomeTelugu Newsప్రాణాలు కాపాడిన ఆపిల్‌ వాచ్‌

ప్రాణాలు కాపాడిన ఆపిల్‌ వాచ్‌

14 10రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆపద సమయాల్లో మనుషుల కంటే ముందే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుతోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ. వాషింగ్టన్‌కు చెందిన గేబ్ బర్డెట్ అనే యువకుడు సెప్టెంబర్ 20న తన తండ్రి బాబ్‌‌తో కలిసి కొండలపై సైకిల్ తొక్కడానికి రివర్‌సైడ్ స్టేట్ పార్క్‌‌కు వెళ్ళాడు. ఇద్దరూ వేరు వేరు మార్గాల్లో వెళ్లి ఓ ప్రాంతంలో కలుసుకుందాం అనుకున్నారు. కాగా, అక్కడికి చేరుకునేలోపే గేబ్‌ తండ్రి పెట్టుకున్న ఆపిల్ వాచ్‌ నుంచి ఓ మెసేజ్ ఎలర్ట్ వచ్చింది.

‘బాబ్ కొండ పైనుంచి కిందపడ్డట్టు గుర్తించాము’ అనేది ఆ ఎలర్ట్ సారాంశం. ఇది చూడగానే గేబ్‌కు మొదట ఏమీ అర్ధం కాలేదు. ఏదైనా తప్పుడు అలెర్ట్ మెసేజ్ వచ్చిందేమో అనుకున్నాడు. ఇంతలో ఓ అనుమానం తలెత్తింది. సైకిల్ తొక్కుతున్న తన తండ్రి కొండపై నుంచి కిందపడ్డాడేమోనని గేబ్ భయంతో వణికిపోయాడు. వేగంగా సైకిల్ తొక్కుతూ ముందుగా అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాడు. కానీ బాబ్ అక్కడ లేడు. దీంతో అతడి అనుమానం నిజమైంది. తన తండ్రి ఏదో ఆపదలో చిక్కుకున్నాడని అర్థమైంది. ఇంతలో మరో మెసేజ్ వచ్చింది. బాబ్ స్థానిక ఆసుపత్రిలో చేరాడని దాని సారాంశం. ఈ విషయాన్ని తన తమ్ముడికి తెలిపాడు. అతడు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు.

బాబ్ ఆసుపత్రిలోనే ఉన్నాడని.. క్షేమంగానే ఉన్నాడని చెప్పడంతో గేబ్ ఊపిరి పీల్చుకున్నాడు. బాబ్ కొండమీద నుంచి జారిపడటం.. స్పృహ కోల్పోవడం.. అతడిని ఆసుపత్రిలో చేర్పించడం అంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. అతడు జారిపడటాన్ని గుర్తించిన ఆపిల్ వాచ్.. ఈ సమాచారాన్ని అటు గేబ్‌కు..ఇటు అత్యవసర సర్వీసులకు పంపించింది. గేబ్ అక్కడకు చేరుకునే లోపలే..అత్యవసర సిబ్బంది అక్కడకు చేరుకుని బాబ్‌ను ఆసుపత్రికి తరలించారు. బాబ్ తలకు చిన్న గాయం అయింది. అయితే ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటనను గేబ్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆపిల్ వాచ్‌ని తెగ పొగుడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!