HomeTelugu NewsYouTube: కొత్త నిబంధనలు..పాటించకపోతే చర్యలు తప్పవు!

YouTube: కొత్త నిబంధనలు..పాటించకపోతే చర్యలు తప్పవు!

youtube introduces new rule
YouTube: ఈ రోజుల్లో యూట్యూబ్‌ చూడకుండా ఉండని వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదు. మనం నిత్యం ఎదో ఒకదాని కోసం యూట్యూబ్‌పై ఆధారపడుతుంటాం. అయితే అలా వస్తున్న కంటెంట్‌లో నిజమెంత..? ఆ కంటెంట్‌లోని ఫొటోలు, వీడియో క్లిప్‌లు, వాయిస్‌లు నిజంగా ఆ వీడియో అప్‌లోడర్లవేనా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేలా యూట్యూబ్‌ కొత్త నియమావళిని తీసుకురాబోతుంది.

కృత్రిమ మేధ(ఏఐ) పురోగమిస్తున్నందున అది తయారుచేసే కంటెంట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంటెంట్‌కు సంబంధించి వాస్తవాలు ఎంతనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఏఐ సృష్టిస్తున్న సమాచారాన్ని ఎలా నిర్ధారించాలో ఒకింత సవాలుగా మారుతోంది. ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్‌ల రూపంలో ఏఐ మోడల్‌ల ద్వారా వచ్చిన డేటాను స్పష్టంగా గుర్తించడంలో కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ఈ సమస్యలకు పరిష్కారంగా యూట్యూబ్‌ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఆ వార్తల సారాంశం ప్రకారం.. కృత్రిమ మేధతో రూపొందించిన వీడియోలకు సంబంధించి యూట్యూబ్‌ నియమాలను ప్రకటించనుంది. యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్‌లోడ్‌ చేసేముందు కొన్ని జనరేటివ్‌ ఏఐ క్లిప్‌లు, వాస్తవికతకు దగ్గరగా ఉండే కృత్రిమంగా సృష్టించిన వీడియోలను జోడిస్తుంటారు.

వీక్షకులు దాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్ల నిజమైన కంటెంట్‌ అని భ్రమపడే అవకాశం ఉంది. అలాంటి వారు ఇకపై తమ వీడియోలకు లేబులింగ్‌ ఇవ్వాలని యూట్యూబ్‌ కొత్త నియమాల్లో పేర్కొననుంది. వీడియో ఫుటేజీలో మార్పులు చేస్తున్నవారు, ఇతర పద్ధతుల్లో వాడుకుంటున్నవారు, రియల్‌ వాయిస్‌ను మర్చి సింథటిక్ వెర్షన్‌లను వినియోగిస్తున్నవారు తమ వీడియోలో లేబుల్‌ని చేర్చాల్సి ఉంటుంది.

వీడియోలోని కంటెంట్‌ మార్పులు, ఫుటేజీ వివరాలు, సింథటిక్‌ అంశాలను పేర్కొంటూ విజువల్స్‌ రూపంలో లేదా వీడియో డిస్క్రిప్షన్‌ రూపంలో ఇ‍వ్వాలి. లేదంటే వాయిస్‌ రూపంలో అయినా తెలియజేయాలి. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే యూట్యూబ్‌ చర్యలు తీసుకోబుతున్నట్లు తెలిసింది. ఈ నిబంధనలు మొబైల్ యాప్, డెస్క్‌టాప్, టెలివిజన్ ఇంటర్‌ఫేస్‌ వినియోగదారులందరికీ వర్తింపజేయనుంది. వార్తలు, ఎన్నికలు, ఫైనాన్స్, ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కంటెంట్‌లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు యూట్యూబ్‌ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!