Homeపొలిటికల్ఈ రోజు రాజశేఖర్‌‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది: వైఎస్ షర్మిల

ఈ రోజు రాజశేఖర్‌‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది: వైఎస్ షర్మిల

YS sharmila arrest fires on

ఏపీలో కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం ఆంధ్రరత్న భవన్‌ నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు.

సచివాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. 151 సెక్షన్ కింద సంతాకం తీసుకుని ఆమె విడుదల చేశారు. అనంతరం బయటకి వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ వారసత్వం అంటే ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు.

మహిళనని కూడా చూడకుండా తనను రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌లో ఉంచారని విరుచుకుపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి గాయమైందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. నన్నే అరెస్ట్ చేపిస్తావా.. నీ అంతు చూస్తా అంటూ జగన్‌కి షర్మిల మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు తన పరిస్థితిని చూసి తన తండ్రి దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సచివాలయంలో వినతి పత్రం ఇద్దామని వస్తే ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి ఎందుకు రారని ప్రశ్నించారు. చివరకు సీఎస్ కూడా సచివాలయంలో ఉండరన్నారు. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. సీఎం జగన్ ప్రత్యేక రాజ్యాంగంలో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని షర్మిల విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక రాచరికపు పాలన లో ఉన్నామా? అని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని షర్మిల అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu