‘కురుక్షేత్రం’ ట్రైలర్‌ను విడుదల చేసిన నాని

సీనియర్‌ నటుడు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరో గా నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. ఈ చిత్రంలో ప్రసన్న, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, వైభవ్‌, సుహాసిని, శ్రుతి హరిహరణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్‌ వైద్యనాథన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాను ‘నిబునన్’ టైటిల్‌తో తమిళంలో విడుదల చేశారు. దీనికి అక్కడ విశేషమైన స్పందన లభించింది. త్వరలో చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది.కాగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ హీరో నాని విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన నటుడు అర్జున్‌ 150వ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. అర్జున్‌ ఇందులో పోలీసు అధికారి పాత్రలో కనిపించారు.

‘చూసే వాళ్ల దృష్టిని బట్టి పెయింటింగ్‌ అర్థం మారుతుంది. ఏం అర్థమైందో చూసి చెప్పండి’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. అర్జున్‌ సతీమణి ఆయన్ను ఈ ప్రశ్న అడిగారు. దీనికి ఆయన ‘ఇదిగో నీలం కనిపిస్తోందే అది కొలను.. ఇక్కడ ఓ హత్య జరిగింది. ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్రగా కనిపిస్తోందే అదే రక్తం. ఈ కత్తి పట్టుకెళ్తున్నాడే.. చంపేసి వెళ్తున్నాడు’ అని పోలీసు దృష్టితో దాన్ని వర్ణించారు. ఒక పోలీసు వాడికి రాకూడని వ్యాధి.. అంటూ వైద్యురాలు అర్జున్‌ ఆరోగ్య సమస్య గురించి చెబుతూ కనిపించారు. యాక్షన్‌-థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘మనం ఎలా ఆలోచిస్తున్నామో వాడూ అలానే ఆలోచిస్తున్నాడు. కాబట్టి.. మనం వాడికంటే ముందుండాలి’ అంటూ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.