HomeTelugu Newsరివ్యూ: సప్తగిరి ఎక్స్ ప్రెస్

రివ్యూ: సప్తగిరి ఎక్స్ ప్రెస్

నటీనటులు: సప్తగిరి, రోషిణి ప్రకాష్, పోసాని కృష్ణ మురలి, హేమ, షాయాజీ షిండే తదితరులు
సంగీతం: బుల్గెనిన్
నిర్మాత: డా.రవికిరణ్
దర్శకత్వం: అరుణ్ పవార్
కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న నటుడు సప్తగిరి. ఈ మధ్య కాలంలో చాలా మంది కమెడియన్స్ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే క్రమంలో సప్తగిరి కూడా హీరోగా, అరుణ్ పవార్ దర్శకత్వంలో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్ ‘ అనే
సినిమాలో నటించాడు. తమిళంలో రూపొందిన తిరుధన్ పోలీస్ అనే చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చదువుకున్న సప్తగిరి(సప్తగిరి) సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ తన తండ్రి శివప్రసాద్ కు మాత్రం కొడుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్ చూడాలని కల. అతడొక హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. అయితే సప్తగిరి ఉండే ఏరియాలో అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టడం.. చైన్ స్నాచింగ్ వంటి అక్రమ కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటిని మాణిక్యం అనే రౌడీ నడుపుతుంటాడు. ఈ పనులను డీఎస్పీ పాపాయమ్మ(పోసాని కృష్ణమురళి) అతడి భార్య సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ అరాచకాలను ఆపాలని ఎస్పీ, డీఎస్పీకు ఆదేశాలు జారీచేస్తాడు. డీఎస్పీ, అతడి భార్య జరిపే ఈ దందాలకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ ఓ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న పాపాయమ్మ, మాణిక్యం సహాయంతో శివప్రసాద్ ను చంపిస్తారు. ఆ తరువాత ఏం జరిగింది..? సప్తగిరి తన తండ్రిని చంపిన దుర్మార్గులపై పగ తీర్చుకున్నాడా..? తన తండ్రి కోరిక ప్రకారం సప్తగిరి పోలీస్ అయ్యడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
సినిమా ఓపెనింగ్ సీన్ లోనే పురాణాల్లో కనిపించే పరశురాముడి వేషంలో సప్తగిరి కనిపిస్తాడు. ఆ వేషంలో అతడు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలానే దుర్యోధనుడి పాత్రలో తను పలికించే డైలాగ్స్ సప్తగిరిలోని మంచి నటుడ్ని చూపించింది. డైలాగులను నిరాటంకంగా పలికించి మెప్పించాడు. తమిళ మాతృక నుండి సోల్ తీసుకొని దాని చుట్టూ కథను రాసుకున్నాడు సప్తగిరి. ఆ కథను ఎగ్జిక్యూట్ చేయడం అరుణ్ పవర్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. కానీ కథలో మాత్రం ఎలాంటి కొత్తదనం లేదు. సినిమా మొదటి భాగం పూర్తయ్యే వరకు కథలోకి వెళ్లకపోవడం ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ మొదలవుతుందో.. స్క్రీన్ ప్లే పుంజుకుంటుంది.

కానిస్టేబుళ్ల జీవితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెరపై బాగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు వచ్చే కామెడీ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. రెండు, మూడు సన్నివేశాలు త్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్ ను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు. ఇప్పటివరకు కమెడియన్ గా ఆడియన్స్ ను నవ్వించిన సప్తగిరి ఈ సినిమాతో ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో కూడా బాగా నటించగలనని నిరూపించుకున్నాడు. సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ ఉన్నంతలో ఓకే అనిపించింది. కమెడియన్ షకలక శంకర్ తన శ్రీకాకుళం యాసతో నవ్వించాడు. సప్తగిరి, షకలక శంకర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. పోసాని కృష్ణ మురలి, షాయాజీ షిండే, హేమ తమ పాత్రల పరిధుల్లో చక్క్గగా నటించారు. సినిమాలో లవ్ ట్రాక్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది.

పాటలు కూడా సంధార్భానుసారంగా లేవు. మ్యూజిక్ అంతంత మాత్రంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ పై బాగా ఫోకస్ చేయాల్సివుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. స్టార్ కమెడియన్ గా వెలుగొందుతోన్న సప్తగిరికి హీరోగా ఈ సినిమా పర్వాలేదనిపించింది. కానీ సప్తగిరిని కమెడియన్ గా ఇప్పటివరకు చూసిన ఆడియన్స్ కు హీరో అనే ఫీలింగ్ కలగాలంటే చాలా సమయం పట్టోచ్చు. ఉన్నంతలో అతడు పర్వాలేదనిపించినా.. కథ, కథనాల్లో పట్టు లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ సప్తగిరిపై పడింది. మొత్తానికి ఎలాంటి లాజిక్స్ ఆశించకుండా వినోదం ఆశించే ప్రేక్షకులకు మాత్రం ఈ పట్టాలు తప్పిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ నచ్చే అవకాశాలు ఉన్నాయి.
రేటింగ్: 2.5/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu