నెలాఖరుకు పూర్తికానున్న ‘యూటర్న్’

ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘యూటర్న్’. కన్నడలో ఘన విజయం సాధించిన యూటర్న్‌ చిత్రానికి రీమేక్‌గా తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా రూపొందుతోంది. పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెలాఖరుకు పూర్తి కానుండడంతో జులై మొదటి వారం నుండి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను మొదలెట్టనున్నారు. ప్రమోషన్స్‌ లో భాగంగా త్వరలోనే సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు.

నేచురల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సమంత ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుంది. ఆది పినిశెట్టి పోలీస్‌ పాత్రలో చేస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే నటి భూమిక కూడా కథలో కీలకమైన పాత్రలో నటిస్తోంది. కన్నడలో ఈ చిత్రం ఘన విజయం సాధించి, క్రిటిక్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వివరాలు తెలిసే అవకాశముంది.