HomeTelugu Reviews"ఆఫీసర్" మూవీ రివ్యూ

“ఆఫీసర్” మూవీ రివ్యూ

చిత్రం : ఆఫీసర్
నటీనటులు : అక్కినేని నాగార్జున, మైరా సరీన్, బేబీ కావ్య, ఫెరోజ్ అబ్బాసీ తదితరులు
సంగీతం : రవి శంకర్
నిర్మాతలు : రాంగోపాల్ వర్మ, సుధీర్ చంద్ర
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : రాంగోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ : ఎన్. భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స
విడుదల తేదీ : 01-06-2018

4

రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన సినిమా శివ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంతం, గోవిందా గోవిందా వచ్చినా అంతటి విజయం సాధించలేకపోయాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సుమారు పాతికేళ్ల తర్వాత మళ్లీ “ఆఫీసర్” మూవీ తెరకెక్కింది. కర్ణాటకలోని ఐపీఎస్ అధికారి ప్రసన్న జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు వర్మ చెప్పారు. నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రం గురించి చెబుతూ దర్శకుడు వర్మను నాగ్ తెగ పొగిడేశాడు. వరుస పరాజయాలతో ఉన్న వర్మకు ఈసినిమాతో ఊరట లభించనుందా.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రివ్యూలోకి వెళితే…

కథ: హీరో నాగార్జున (శివాజీరావు) ఓ పోలీస్ ఆఫీసర్. నారాయణ పసారి (ఫెరోజ్ అబ్బాస్) ముంబైలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. వరుస ఎన్‌కౌంటర్లతో ముంబైలో మాఫియా లేకుండా చేస్తుంటాడు. ప్రజల్లో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అదే సమయంలో ఫేక్ ఎన్‌కౌంటర్ చేశాడని అతడిపై కేసు వేస్తారు. ఈ కేసు దర్యాప్తు కోసం శివాజీరావు(నాగార్జున) నేతృత్వంలో ఓ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. అది ఫేక్ ఎన్‌కౌంటర్‌ అని తేలుతుంది. పసారికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నట్లు బయటపడుతుంది. దీంతో పసారి అరెస్టవుతాడు. శివాజీరావుపై కక్ష పెంచుకుంటాడు నారాయణ పసారి. సాక్షిని ఎవరో చంపేయడంతో కేసు నుంచి పసారి నిర్దోషిగా బయటపడతాడు. ఆ సమయంలో అండర్ వరల్డ్ టీంను క్రియేట్ చేసి నగరంలో పేరుమోసిన వాళ్లను హత్యచేయిస్తాడు. దాంతో ప్రభుత్వం నారాయణ పసారి నేతృత్వంలో ఓ స్పెషల్ ఎన్‌కౌంటర్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. అప్పుడు నారాయణ గేమ్ ఆడి శివాజీకి అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయని అందరినీ నమ్మిస్తాడు. అప్పుడు శివాజీరావు ఏం చేస్తాడు? నారాయణ తనపై పడ్డ నింద నుంచి ఎలా తప్పించుకుంటాడు, శివాజీరావు, నారాయణ పసారి మధ్య జరిగిన వార్ మిగతా కథ.

నటీనటులు: నాగార్జున ఈ చిత్రంలో ఏజ్‌ ఏమాత్రం కనపడకుండా చాలా యంగ్‌గా కనిపించాడు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున మెప్పించారు. శివాజీరావు పాత్రకు తగిన న్యాయం చేశాడు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సినదంతా తన నటనలో చూపాడు. నారాయణ పసారి పాత్రలో ఫెరోజ్ అబ్బాస్ చాలా సహజంగా నటించాడు. అవినీతి అధికారిగా ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నాగార్జున కూతురుగా చేసిన బేబీ కావ్య నటన బాగుంది. హీరోయిన్ మైరా సరీన్ పాత్ర చిన్నదే అయినా ఫర్వాలేదనిపించింది.

4a

విశ్లేషణ: ప్రధానంగా సినిమా హీరో, విలన్ పాత్రల మధ్యే ఎక్కువగా నడుస్తుంది. శివ సినిమా తర్వాత నాగార్జున-వర్మ కాంబినేషన్‌లో అంతటి అంచనాలతో ఆఫీసర్‌ మూవీ తెరకెక్కించాడు దర్శకుడు వర్మ. మాఫియా, అండర్ వరల్డ్, పోలీసులకు సంబంధించిన కథలు డీల్ చేయడంలో రామ్ గోపాల్‌వర్మ దిట్ట. అందుకే ఈ మూడు అంశాలు ఈ సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. రొటీన్ సినిమాలకు భిన్నంగా కథను సిద్ధం చేసుకున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, దానిలో జరిగే తతంగాన్ని చక్కగా చూపించాడు. కథ ప్రారంభం నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఆకట్టుకుంది. సామాన్య ప్రేక్షకుడికి ఈ తరహా కథ కాస్త కొత్తగా అనిపిస్తుంది. పస్టాఫ్‌లో హీరో శివాజీరావు చేసే ఇన్వెస్టిగేషన్ అంశాన్ని చాలా పకడ్బందీగా తెరకెక్కించడం చూస్తుంటే దర్శకుడు వర్మ మళ్లీ ట్రాక్‌లో పడ్డాడనిపిస్తుంది. టెక్నాలజీ పరంగా వర్మ తన సత్తా చూపించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్టాఫ్ ఎంతో ఆసక్తికరంగా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కథను చాలా రొటీన్‌గా మార్చేశాడు. హీరో-విలన్‌ల మధ్య రివెంజ్ డ్రామా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఛేజింగ్‌లు, ఫైట్లకే పరిమితమయ్యాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో చూపించిన ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంటుంది. సెకండాఫ్ కూడా సరిగా డీల్‌చేసి ఉంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండేదనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా సాధారణంగానే అనిపిస్తాయి.

హైలైట్స్
కథలో కొత్తదనం
పస్టాఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

డ్రాబ్యాక్స్
సెకండాఫ్ కథనం
క్లైమాక్స్ రొటీన్‌గా ఉండటం
నిర్మాణ విలువలు

చివరగా ఆఫీసర్ మూవీ చూస్తే వర్మ ట్రాక్ మారినట్లనిపిస్తుంది
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu