రివ్యూ: గురు

నటీనటులు: విక్టరీ వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్ సర్కార్, జాకీర్ హుస్సేన్, రఘుబాబు,
తనికెళ్ళ భరణి తదితరులు.
సంగీతం: సంతోష్ నారాయణ్
ఎడిటింగ్: సతీష్ సూర్యా
సినిమాటోగ్రఫీ: కె.ఏ.శక్తివేల్
నిర్మాత: శశికాంత్
దర్శకత్వం: సుధా కొంగర

వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ.. హిట్స్ అనుకుంటున్న హీరో విక్టరీ వెంకటేష్ నటించిన మరో చిత్రం ‘గురు’. బాక్సింగ్ నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
ఆదిత్యరావు(వెంకటేష్) ఢిల్లీకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బాక్సింగ్ కోచ్ గా విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. బాక్సింగ్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులకు, అక్కడ జరిగే రాజకీయాలకు ఆది చాలా దూరం. దేవ్(జాకీర్ హుస్సేన్)అసోసియేషన్ కు హెడ్. ఆదిత్యకు దేవ్ తో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీంతో దేవ్, ఆదిత్యను వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడ ఆదిత్య స్లమ్ లో ఉండే రాముడు(రితికా సింగ్) అనే అమ్మాయిని చూస్తాడు. తనలో ఉన్నబాక్సింగ్ స్కిల్స్ ఆదిత్యను ఆకట్టుకుంటాయి. దీంతో ఆదిత్యను ఆమెను ఛాంపియన్ చేయాలనుకుంటాడు. కానీ రాముడు మాత్రం కోచ్ కు ఎదురుచెబుతూ పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ తరువాత కొన్ని రోజులకి కోచ్ లో ఉన్న నిజాయితీ తెలుసుకొని బాక్సింగ్ ను సీరియస్ గా తీసుకుంటుంది. అలానే కోచ్ తో ప్రేమలో పడుతుంది. దానికి ఆదిత్య అంగీకరించడు. ఓ బాక్సింగ్ కాంపిటీషన్ లో కొన్ని కారణాల వలన రాముడు ఓడిపోతుంది. కావాలనే రాముడు అలానే చేసిందనుకొని ఆమెనుటీం నుండి వెలివేస్తాడు ఆదిత్య. మరోసారి రాముడుకి అవకాశం వస్తుందా..? గురువు ఆశించినట్లుగా ఛాంపియన్ అవుతుందా..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

ప్లస్ పాయింట్స్:

వెంకటేష్, రితికా సింగ్
పాటలు
కథ, కథనం

మైనస్ పాయింట్స్:

నేపధ్య సంగీతం
క్లైమాక్స్ ఎపిసోడ్స్

విశ్లేషణ:

సినిమా మొదటి భాగం ఆసక్తికరంగా, అందరినీ ఆకట్టుకునేలా రూపొందించడంలో దర్శకురాలు సుధా కొంగర సక్సెస్ అయింది. సెకండ్ హాఫ్ లో కూడా బాగానే డీల్ చేసింది. కానీ ఎప్పుడైతే క్లైమాక్స్ ఎపిసోడ్స్ కు సినిమా చేరుకుంటుందో.. కాస్త రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్ స్పోర్ట్స్ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ ను తలపిస్తుంది. అప్పటివరకు ఓడిపోతున్న శిష్యురాలు, కోచ్ కనిపించిన వెంటనే గెలవడం రొటీన్ గా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో అంతకు మించి ఆశించలేం.

సిన్సియర్, మొండి బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. డైరెక్టర్ సుధా ఎమోషన్స్ మీద సినిమా మొత్తం నడిపించింది. సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. రితికా సింగ్ తన పాత్రలో ఒదిగిపోయింది. తను తప్ప ఆ పాత్రలో మరెవరూచేయలేనంతగా అనిపించింది. ఆడియన్స్ దృష్టి మొత్తం తనవైపే ఉండేలా చూసుకుంది. ముంతాజ్ ఉన్నంతలో ఆకట్టుకుంది. జాకీర్ హుస్సేన్, తనికెళ్ళ భరణి, నాజర్ తమ పాత్రల పరిధుల్లో ఓకే అనిపించారు. సినిమా మొత్తం గురు, శిష్యురాలి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

టెక్నికల్ గా సినిమా బావుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. వైజాగ్ ను చూపించే రెండు షాట్స్ బావున్నాయి. పాటలన్నీ సంధర్భానుసారంగా ఉన్నాయి. నేపధ్య సంగీతంపై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. ఎడిటింగ్ వర్క్ క్రిస్పీగా ఉంది. అనుకున్న బడ్జెట్ లో సింపుల్ గా సినిమాను చేసేశారు. అటు మాస్ ఆడియన్స్ తో పాటు ఇటు క్లాస్ అడియన్స్ ఇలా అందరినీ నచ్చే సినిమా ‘గురు’

రేటింగ్: 3/5