24 గంటల్లో 40 లక్షల వ్యూస్‌.. ‘ఎన్‌.టి.ఆర్‌’కి విశేషస్పందన

నిన్న శుక్రవారం సాయంత్రం విడుదలైన ‘ఎన్‌.టి.ఆర్‌’ ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ’60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ మా కోసం బతికాం… ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం’ అంటూ.. మొదలైన ఈ ట్రైలర్‌ను 24 గంటల్లో 40 లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేసింది. మరోపక్క ట్రైలర్‌ అద్భుతంగా ఉందని అనేక మంది ప్రముఖులు ట్వీట్లు చేశారు. అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని, లింగుస్వామి, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌, సందీప్‌ కిషన్, మనోజ్‌ కుమార్, రాధిక తదితరులు చిత్ర బృందాన్ని ప్రశంసించిన వారిలో ఉన్నారు.

తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి భాగం ‘కథానాయకుడు’ ను జనవరి 9న, రెండో భాగం ‘మహానాయకుడు’ ను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.