రోబో 2 తెలుగు హ‌క్కుల వెనక‌ డ్రామా!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `రోబో 2` తెలుగు రిలీజ్ హ‌క్కుల కోసం తీవ్ర‌మైన పోటీ నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఈ పోటీలో ప్ర‌ముఖ నిర్మాత కం డిస్ట్రిబ్యూట‌ర్ సునీల్ నారంగ్ 2.ఓ (రోబో2) తెలుగు రిలీజ్ హ‌క్కులు చేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. దాదాపు 80 కోట్ల మేర డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల కోసం నారంగ్ వెచ్చించార‌ని తెలుస్తోంది. 
 
వాస్త‌వానికి `రోబో 2` తెలుగు రిలీజ్ హ‌క్కులు ఛేజిక్కించుకునేందుకు ప్ర‌ముఖ నిర్మాత‌, వారాహి చ‌ల‌న‌చిత్రం అధినే సాయి కొర్ర‌పాటి చాలా సీరియ‌స్‌గా ట్రై చేశారుట‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌కు 60 కోట్ల మేర ఆఫ‌ర్ చేశార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. బాహుబ‌లి ద‌ర్శ‌కుడు, త‌న‌కి అత్యంత స‌న్నిహితుడు అయిన ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిని చెన్న‌య్ తీసుకుని వెళ్లి మ‌రీ రిక‌మండ్ చేయించుకున్నారుట కొర్ర‌పాటి. కానీ లైకా సంస్థ అధినేత శుభ‌క‌ర‌న్‌ తెలుగు హ‌క్కులు 80 కోట్లకు ఫిక్స్‌ చేశార‌ని, ఆలోపు స‌సేమిరా అనేశార‌ని తెలుస్తోంది. రాజ‌మౌళి రిక‌మండేష‌న్ సైతం ఈ సంద‌ర్భంలో ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని, త‌మిళ నిర్మాత‌లు పైస‌ల విష‌యంలో పెర్ఫెక్ట్‌గా ఉంటార‌ని చెప్పుకుంటున్నారు. అయితే రోబో2 తెలుగు రిలీజ్ గురించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉందింకా.