నా తొలి పోస్ట్‌ నీకే అంకితం చేస్తున్నా అమ్మా.. ఇన్‌స్టాగ్రామ్ లో రామ్‌ చరణ్‌

రామ్‌చరణ్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచిన సంగతి తెలిసిందే. కాగా.. తన ఖాతాలో చరణ్‌ తొలి ఫొటోను పోస్ట్‌ చేశారు. తన తల్లితో కలిసి చిన్నప్పుడు దిగిన ఫొటోను, ఇటీవల దిగిన ఫొటోను కలిపి పోస్ట్‌ చేశారు. ‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నా తొలి పోస్ట్‌ నీకే అంకితం చేస్తున్నా. లవ్యూ అమ్మా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ పోస్ట్‌ పెట్టిన కొద్దిసేపటికే 50వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ‘చరణ్‌ అన్నా.. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావ్‌’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చెర్రీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచిన కొద్దిసేపటికే వెరిఫైడ్‌ మార్క్‌ వచ్చేసింది. ప్రస్తుతం ఆయన ఖాతాను నాలుగు లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు.

మరోపక్క చరణ్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించారు. వారం రోజుల విశ్రాంతి అనంతరం ఇటీవల మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టారు. దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.