అదా శర్మ ‘తల్లి’ గాల్లో యోగాతో ఆశ్చర్యపరుస్తుందిగా..

‘హార్ట్ అటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ హీరోయిన్‌ అదా శర్మ. ‘సన్నాఫ్ సత్యంమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నాని సరసన ‘జెర్సీ’ సినిమాలో చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలోనూ నటిస్తోంది. వాస్తవానికి అదా శర్మది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. తమిళనాడు బ్రాహ్మణ కుటుంబంలో అదా జన్మించింది. ఆమె కుటుంబంలో అందరూ విద్యావంతులే. ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఉన్నారు. ఆమె తల్లి షీలా శర్మ కూడా కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేశారు. అంతేకాదు ఆమె మల్లఖంబ్ యోగా నిపుణురాలు.

శుక్రవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని తన తల్లి యోగా వీడియోను అదా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో షీలా శర్మ వేస్తోన్న యోగాసనాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురికావాల్సిందే. సుమారు 45 ఏళ్ల వయసులోనూ తాడు సహాయంతో గాల్లో ఆమె చేస్తోన్న యోగాసనాలు వామ్మో అనిపిస్తున్నాయి. ముఖ్యంగా తాడును చేతులతో పట్టుకోకుండా గాల్లో వేస్తోన్న సుఖాసనం హైలైట్.

తన తల్లి యోగాసనాలు వేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో షేర్ చేసిన అదా శర్మ.. అమ్మపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రతి రోజూ తన తల్లి తనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటుందని అదా పేర్కొంది. తన తల్లి తనను నమ్మి ఎంతో స్వేచ్ఛను ఇచ్చిందని అదా వెల్లడించింది. మగాడి కన్నా తాను తక్కువేమీ కాదు అనే భావనను, ధైర్యాన్ని తనలో కలిగించిందని చెప్పింది. ఒక్కరోజు ముందుగానే తన తల్లికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపింది.