చిరంజీవి 152వ సినిమాలో ఐశ్వర్యరాయ్‌‌..?

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ను హీరోయిన్‌గా ఎంపికచేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీపై రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇందులో నయనతారను కథానాయికగా ఎంపికచేసుకోవాలనుకుంటున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ఐష్‌ పేరు వినిపిస్తోంది.

చిరు పక్కన ఎప్పుడూ చూడని నటిని ఎంపికచేసుకుంటే సినిమాకు ఫ్రెష్‌లుక్‌ వస్తుందని, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నయనతారే హీరోయిన్‌ కావడంతో ఆమెను వద్దనుకున్నారని ఫిలిం వర్గాల సమాచారం. త్వరలో కథానాయికకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ సెట్‌ని తీర్చుదిద్దుతున్నారు. అక్కడే తొలి షెడ్యూల్‌ త్వరలో మొదలు కానుంది. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.