నటి అలియా భట్ పార్టీ గుర్తు ఇదే..!


బాలీవుడ్‌ నటి అలియా భట్‌ తన పార్టీ గుర్తును ప్రకటించారు. ఎందుకంటే ఎక్కడికెళ్లినా ఈ మధ్య రాజకీయాల ప్రస్తావన ఆమెను వదిలి పెట్టడం లేదు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడూ ఆమెను ఓటింగ్‌ గురించి మీడియా అడిగింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కళంక్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె తన సహనటులతో అలియా భట్ కపిల్‌ శర్మ షోలో సందడి చేశారు.

షోలో భాగంగా కపిల్‌ శర్మ ఆమెను ఆటపట్టించారు. ఈ క్రమంలో అలియాను రాజకీయ పార్టీ స్థాపిస్తే తన పార్టీ గుర్తు ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి అలియా స్పందిస్తూ.. నేను రాజకీయాల్లోకి వస్తే నా పార్టీ గుర్తుగా ప్లేట్‌ను ప్రతిపాదిస్తాను. ఎందుకంటే ఈ గుర్తును ఇంతవరకు ఎవరూ ఎంచుకోలేదు కాబట్టి. మన నిత్య జీవితంలో ప్లేట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది అని చెప్పుకొచ్చింది. వరుణ్‌ ధావన్‌ మాత్రం చెడ్డీ అని చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయి ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు.

కళంక్‌ చిత్రంలో ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా, మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.