ఈ అభిమానాన్ని కలకాలం గుర్తుంచుకుంటా: అల్లు అర్జున్‌

కేరళలోని అలెప్పీలో 66వ నెహ్రూ ట్రోఫీ బోట్‌రేస్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. వరదలతో ధ్వంసమైన కేరళలో పడవల పండుగతో కొత్త శోభ వచ్చింది. కేరళీయుల సంస్కృతికి అద్దం పట్టేలా జరిగే ఈ పడవల పోటీలకు తెలుగు సీని నటుడు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా బన్నీ ఈరోజు స్నేక్‌బోట్‌ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. కేరళ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఈ అభిమానాన్ని కలకాలం గుర్తు పెట్టుకుంటానన్నారు. నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కేరళ గవర్నర్‌ సదాశివం హాజరయ్యారు.

ఈ రోజు కేరళలోని కొచ్చికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌కు కేరళ ప్రజలు ఘన స్వాగతం పలికారు. శనివారం అలప్పుజ ప్రాంతంలోని పున్నమ్‌ద సరస్సులో జరగనున్న ఈ పోటీలకు అర్జున్‌ అతిథిగా హాజరు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం స్టైలిష్‌ స్టార్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి కొచ్చి చేరుకున్నారు. బన్నీని పలకరించడానికి, చూడటానికి విమానాశ్రయానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి బన్నీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.