దేశంలో రైతుల పట్ల అమితాబ్‌..!

రైతులు రుణాలు చెల్లించలేక పడుతున్న కష్టాల పట్ల బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్‌ చలించిపోయారు. ఇప్పటికే వారిని ఆదుకోవడానికి తనవంతు సాయం కూడా చేస్తున్నారు. అయితే మరికొంత మంది కూడా ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రఖ్యాత టీవీ షో కేబీసీ వేదికగా పిలుపునిచ్చారు. అనంత్‌కుమార్ ఖన్కే అనే రైతు ఆ షోలో తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించడంతో చలించిన అమితాబ్ ఈ అభ్యర్థన చేశారు. వానలు సక్రమంగా కురిస్తే తనకు వార్షిక ఆదాయం రూ.60,000 వస్తుందని ఆ రైతు వెల్లడించాడు. లేకపోతే ఒక్కో గ్యాలన్‌ నీటికి రూ.100 చెల్లించి పంట పండించాల్సి ఉంటుందని వివరించాడు. దాంతో అప్పులు పెరిగిపోతున్నాయని తనలాంటి రైతులు పడే కష్టాలను వెల్లడించాడు. అయితే ఈ రైతు ఎదుర్కొంటున్న కష్టాలతో కదిలిపోయిన అమితాబ్‌ ప్రేక్షకులకు ఓ ప్రకటన చదివి వినిపించారు.

“పదేళ్ల క్రితం విశాఖపట్నంలో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఓ రైతు కేవలం రూ.10,000 నుంచి రూ.20,000 వేలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకొన్న ఘటన తెలిసి ఎంతో బాధపడ్డాను. నేను వెంటనే ఓ ఎన్జీఓను సంప్రదించి సాయం చేస్తాననగా వారు 30 నుంచి 40 మంది రైతుల జాబితాను నాకు పంపించారు. వెంటనే వారి రుణాలు చెల్లించాను. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం విదర్భలో వర్షాలు కురవకపోవడంతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న 100 మంది రైతుల రుణాలు కట్టేశాను. అలాగే మహారాష్ట్రలో 360 మంది రైతుల రుణాలు తీర్చగా, ఇప్పుడు యూపీలో 850 మంది రైతుల అప్పులు చెల్లించబోతున్నాను”అని తెలిపారు. కనీసం ఓ పదిమంది సాయం చేయడానికి ముందుకొస్తే దాన్ని చూసి ఇంకొంతమంది వచ్చే అవకాశం ఉందన్నారు. దాంతో ఎంతో మంది రైతుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. “నేను నా గురించి గొప్పలు చెప్పుకోవాలనుకోవడం లేదు. కనీస అవసరాలు లేక ఇబ్బంది పడుతోన్న రైతులకు సాయం చేయాలని మాత్రం కోరుకుంటున్నా” అని ప్రజలను అభ్యర్థించారు.