రెండో సినిమాకు సిద్ధమైన రౌడీ తమ్ముడు!

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన అభిమానులను ప్రేమగా రౌడీస్‌ అని పిలిచుకుంటారు. విజయ్‌ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలోనూ తన తమ్ముడి కెరీర్‌ను గాడి పెట్టే పనిలో ఉన్నాడు. విజయ్‌ దేవరకొండ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆనంద్‌ దేవరకొండ. దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆనంద్ తొలి సినిమాతో మంచి మార్కలు సాధించాడు. సినిమా డివైడ్‌ టాక్‌ వచ్చినా మంచి వసూళ్లనే సాధిస్తోంది. అయితే తొలి సినిమాతో ప్రయోగం చేసిన ఆనంద్ రెండో సినిమాగా మాత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే ఆనంద్‌ దేవరకొండ రెండో సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. భవ్యక్రియేషన్స్‌ బ్యానర్‌ కొత్త దర్శకుడితో ఆనంద్‌ రెండో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్‌ కోసం దర్శకుడు తయారు చేసుకున్న కథనే ఆనంద్‌ కోసం తీసుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ టాక్‌ నిజమైతే ఈ నెలలోనే ఈప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.