వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూశాకే హైకోర్టు తుది తీర్పు

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. మూవీ రిలీజ్‌పై ఏప్రిల్‌ 3వ తేదీ వరకు స్టే విధించింది. తదుపరి విచారణను కూడా ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. సినిమా కాపీని తమ ఛాంబర్‌కు తీసుకువస్తే న్యాయవాదుల సమక్షంలో సినిమా చూస్తామని జడ్జి తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైకోర్టు జడ్జి చాంబర్‌లో న్యాయవాదుల సమక్షంలో చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది హైకోర్టు. చిత్ర నిర్మాత కూడా చిత్ర ప్రదర్శనకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. సినిమా వీక్షించిన తర్వాతే తుదితీర్పు వెల్లడిస్తామని వెల్లడించింది హైకోర్టు. మరోవైపు సెన్సార్ బోర్డ్ ఒకసారి అనుమతించాక అడ్డు చెప్పడానికి వీలులేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటున్నారు. ఈ సందర్భంగా పద్మావతి సినిమా రిలీజ్ పై సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావించారు. తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు.

ఇక మంగళగిరి కోర్టు కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్‌పై ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు మంగళగిరిలో సినిమాను విడుదల చేయొద్దని ఆదేశించింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందంటూ అనిల్‌ అనే వ్యక్తి మంగళగిరి సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా… ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ సినిమా హాళ్లు , సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కూడా విడుదల చేయడానికి వీల్లేదని దర్శకులు రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజుల, నిర్మాత రాకేష్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.